హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బిడ్డ కంటే పార్టీనే ముఖ్యమని నిరూపితమైందని పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు పేర్కొన్నారు. కేసీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కుడి, ఎడుమ భుజాల వంటి వారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు మంగళవారం బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అనంతరం తెలంగాణభవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌ను స్వాగతిస్తున్నామని, ఇది గొప్ప నిర్ణయని చెప్పారు. సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా ఎమ్మెల్సీ కవిత తన తీరుతో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో నష్టం కలిగించారని, ఆమె మాటలు పార్టీ శ్రేణులను ఎంతో బాధించాయని పేర్కొన్నారు. పేగు బంధం కన్నా, తనను నమ్ముకున్న కోట్లాది ప్రజలే ముఖ్యమని, కార్యకర్తల కన్నా.. తన కుటుంబసభ్యులు ఎక్కువేం కాదని కేసీఆర్ నిరూపించారని చెప్పారు.
తన సొంత బిడ్డను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో గతంలో అనేకసార్లు ఎమ్మెల్సీ కవితకు నచ్చజెప్పాలని చూసినప్పటికీ, ఆమె వినలేదని పేర్కొన్నారు. అందువల్లే కేసీఆర్ ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీ తర్వాతే ఎవరైనా అని కేసీఆర్ ఈ విధంగా సందేశం ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న తరుణంలో తన సొంత బిడ్డ పార్టీని అనేక ఇబ్బందులకు గురిచేసిందని చెప్పారు. కేటీఆర్, హరీశ్‌రావుపై కవిత నిరాధారమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. పీసీ ఘోష్ కమిషన్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని, అసెంబ్లీలో హరీశ్‌రావు ఒంటిచేత్తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారని కొనియాడారు. ఒకవైపు హరీశ్‌రావు ప్రసంగాన్ని పార్టీ ఆస్వాదిస్తుంటే.. ఎమ్మెల్సీ కవిత మాత్రం విమర్శించడం చూస్తుంటే.. ఆమె ఏ లైన్లో ఉన్నారో రుజువు చేస్తున్నదని పేర్కొన్నారు.
కేసీఆర్‌కు కుటుంబం కంటే పార్టీనే ముఖ్యమని కవిత సస్పెన్షన్‌తో మరోసారి రుజువైందని మాజీ ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు. తనకు పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని వివరించారు. అసెంబ్లీలో హరీశ్‌రావు మాట్లాడిన తీరు బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం తెచ్చిందని తెలిపారు. ఈ ఉత్సాహాన్ని నీరుగార్చేందుకు ఎమ్మెల్సీ కవితతో కొందరు పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయించారని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల పార్టీ కార్యకర్తలు కోపంగా ఉన్నారని చెప్పారు. సమావేశంలో టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రా ఆనంద్, బీఆర్ఎస్ మహిళా నేతలునేతలు రజనీసాయిచంద్, సుశీలారెడ్డి, సత్యవతి, చారులత, నిరోషా తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవిత భుజం మీద తుపాకీ పెట్టి ఎవరో కాల్చుతున్నారని మాజీ ఎమ్మెల్సీ గొంగిడి సునీత ఆరోపించారు. కేసీఆర్ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అని స్పష్టంచేశారు. పార్టీ ఉంటే ఎంత, లేకుంటే ఎంత.. అని మాట్లాడటంపై క్షేత్రస్థాయిలో ఎంత ఆగ్రహం ఉన్నదో కవితకు తెలుసా? అని ప్రశ్నించారు. ప్రజలు ఆమోదించేవిధం గా ఆమె వ్యవహరించలేదని తెలిపారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్.. ఆ తర్వాత ప్రజలే తన బాస్‌లు అని ప్రకటించిన విషయాన్ని సునీత గుర్తుచేశారు.