నమస్తే నెట్వర్క్ : ‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనే ఎమ్మెల్సీ కవితకు ప్రాధాన్యం వచ్చింది. కేసీఆర్‌ను చూసే మేమంతా కవితతో పార్టీలో కలిసి పనిచేశాం. గత కొన్నాళ్లుగా ఆమె వైఖరి పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నది. పార్టీ ఎంతగా సహించినా, ఆమె మితిమీరి వ్యవహరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతోనే కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి అధిష్ఠానం బహిష్కరించింది. పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తెలిపారు. గతకొన్నాళ్లుగా ఎమ్మెల్సీ కవిత వైఖరి, విపరీత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఏర్పడిందని, అందుకే పార్టీ అధినేత కేసీఆర్ తగు నిర్ణయం తీసుకున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పేర్కొన్నారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ పేరిట కాంగ్రెస్ సర్కార్ వేధించాలని చూస్తున్న తరుణంలోనే, కవిత కాళేశ్వరంపై ఆరోపణలు చేయడం క్షమించరాని విషయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పార్టీ అని, 60 లక్షల మంది సైనికులున్న పార్టీ అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గుర్తుచేశారు.
తప్పు చేస్తే ఎవరినీ సహించేది లేదని కేసీఆర్ గతంలో అన్నమాట ప్రకారం.. కన్నకూతురి కంటే కార్యకర్తల సంక్షేమమే ముఖ్యమని నమ్మి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని పేర్కొన్నారు. కన్నకూతురు కంటే కష్టంలో ఉన్న పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్తే ముఖ్యమని కేసీఆర్ భావించారని, ఆ మేరకు ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం హర్షించదగిందగినదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలో తప్పు చేస్తే కుటుం బ సభ్యులనైనా సహించబోనని కేసీఆర్ తేల్చి చెప్పినట్టయిందని చెప్పారు. పార్టీ కంటే ఎవరూ గొప్పకాదనే విషయాన్ని కేసీఆర్ నిరూపించారని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయంతో అది నిరూపణ అయిందని తెలిపారు. ‘పార్టీలో క్రమశిక్షణ తప్పిన ఎవరైనా, చివరకు కుటుంబ సభ్యులైనా సరే ఉపేక్షించేది లేదని గతంలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అదే చేశారు. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకే ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తెలిపారు. కవిత వైఖరితో గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతున్నదని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. కార్యకర్తల భవిష్యత్తు కోసం కేసీఆర్ నిర్ణయం హర్షించతగినదని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఎమ్మెల్సీ కవిత పలుమార్లు పలు వ్యాఖ్యలు చేశారని నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కవితను అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు స్వాగతించారని తెలిపారు. క్రమశిక్షణ దాటితే సొంత బిడ్డ అయినా కూడా ఉపేక్షించబోమని కేసీఆర్ నిరూపించారని తెలిపారు. ఆపదలో ఉన్న పార్టీకి, అండగా ఉన్న కార్యకర్తల కంటే తన కూతురు ఎక్కువేమీ కాదని కేసీఆర్ నిరూపించారని కామారెడ్డి గంప గోవర్ధన్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని కవిత సస్పెన్షన్ ద్వారా కేసీఆర్ నిరూపించారని హన్మంత్ షిండే ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీకి నష్టం కలిగిస్తే సొంత కూతురిపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడని వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీలో లేకున్నా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తేల్చి చెప్పారు. గత మూడు నెలలుగా కవిత తన వ్యాఖ్యలతో పార్టీకి ఎంతో నష్టం చేశారని ఆరోపించారు. పేగుబంధం కన్నా తనను నమ్ముకున్న కోట్లాది ప్రజలే ముఖ్యమంటూ కేసీఆర్ మరోసారి నిరూపించారని కొనియాడారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారికైనా బీఆర్ఎస్లో శిక్ష తప్పదని అధినేత కేసీఆర్ నిరూపించారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. బీఆర్ఎస్ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, పార్టీ అధినేత కేసిఆర్‌కు రక్త సంబంధీకులైనా, పార్టీ నాయకులైనా ఒక్కటేనని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని, పార్టీ కంటే ఎవరూ గొప్పకాదని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్, పేర్కొన్నారు. కవిత తీరుతో బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లుతున్నదని, అందుకే ఆమెను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రాజీవ్‌సాగర్ తెలిపారు. తెలంగాణ జా తిపిత కేసీఆర్ బాటలో, ఆయన స్ఫూర్తితో పార్టీలో పనిచేస్తామని పేర్కొన్నారు. పార్టీ నియమాలను ధిక్కరిస్తే ఎంతటి వారినైనా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉపేక్షించబోరని ఎమ్మెల్సీ కవిత విషయంలో తేటతెల్లమైందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ తెలిపారు. కవితను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణ యం ఓ హెచ్చరికలాంటిదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీలో తప్పు చేస్తే ఎవరినీ సహించబోరని రైతుబంధు సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్ తెలిపారు. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించమని కేసీఆర్ గతంలోనే తెలిపినట్లు గుర్తు చేశారు.