హైదరాబాద్ జూలై 11 (నమస్తే తెలంగాణ) : ‘ఆర్డినెన్స్ వద్దు.. చట్టమే ముద్దు, సీఎం రేవంత్ డౌన్‌డౌన్, మోసపూరిత కాంగ్రెస్‌ను తరిమికొడదాం’ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినదించాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ సర్కారు దగా చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఈగ ఆంజనేయులుగౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి బంజారాహిల్స్ కళింగ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కళింగ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆర్డినెన్స్ తెచ్చి చేతులు దులుపుకొనే యత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్క సుమన్, బీఆర్ఎస్ బీసీ సెల్ నాయకులు రాజారాం యాదవ్, చిరుమల్ల రాకేశ్, దూదిమెట్ల బాలరాజు, కురువ విజయ్‌కుమార్, కిశోర్‌గౌడ్, సుమిత్రా ఆనంద్, ఉపేందర్, మఠం భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్‌చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సర్కారు దమనకాండ నశించాలి.. రేవంత్ నియంత పాలన అంతం-బీఆర్ఎస్ పంతం.. అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్రమంగా తమ నాయకులను నిర్బంధించారని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొన్నది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి తదితరులు పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ అమలులో కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని నిరసనలకు దిగిన బీఆర్ఎస్ బీసీ నాయకులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా అడ్డుకునేందుకు యత్నించారు. గెల్లు శ్రీనివాస్, ఆంజనేయులుగౌడ్‌ను బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈడ్చుకుంటూ తీసువెళ్లి పోలీస్ వాహనం ఎక్కించి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.