కూసుమంచి/ధర్మసాగర్/ఎల్లారెడ్డి రూరల్/రామారెడ్డి/ సంగెం/ దహెగాం/ కరీంనగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఒక్క ఓటు అభ్యర్థుల జీవితాలను తలకిందులు చేస్తుందనడానికి ఆదివారం నిర్వహించిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిదర్శనంగా నిలిచాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం బీబ్రాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దుర్గం హారిక ఒక్క ఓటుతో గెలుపొందారు. ప్రత్యర్థి అభ్యర్థి ఆందోళనకు దిగడంతో మూడుసార్లు రీకౌంటింగ్ నిర్వహించినా చివరకు హారికనే విజయం వరించింది. వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి సర్పంచ్‌గా కొంగర మల్లమ్మ ఒక్క ఓటుతో గెలుపొందారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా కొంగర మల్లమ్మ, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నవ్యశ్రీ పోటీపడ్డారు. 1647 మంది ఓట్లకు గాను 1451 పోలయ్యాయి. ఇందులో కొంగర మల్లమ్మకు 705, నవ్యశ్రీకి 704 ఓట్లు వచ్చాయి. గ్రామంలో ఒకే ఎస్సీ కుటుంబం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ కేటాయించారు.
కొంగర మల్లమ్మ ఒక్కరే ఉన్నారని ఏకగ్రీవమవుతుందని భావించినా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎస్సీ యువతి నవ్యశ్రీని వివాహం చేసుకోగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పొతంగల్ ఖుర్దూ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బెస్త సంతోష్‌కు 280 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి అభ్యర్థి కొత్తపల్లి శ్రీనివాస్‌కు 279 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో సంతోష్ విజయం సాధించారు. కరక్వాడిలో ముంబాజీ సుధాకర్‌కు 114 ఓట్లు పోలవగా, ప్రత్యర్థి భీమరాయిని రాంచందర్‌రావుకు 113 ఓట్లు రాగా స్వల్ప తేడాతో సుధాకర్ గెలుపొందారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఉల్లెంగల ఏకానందం సమీప అభ్యర్థి పొన్నాల సంపత్‌పై ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. మానకొండూర్ మండలం పెద్దూరుపల్లిలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గంగినేని హరీశ్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి రామడుగు హరీశ్‌పై ఒక్క ఓటుతో ఓడిపోయారు.
శంకరపట్నం మండలం అంబాల్పూర్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఎగుర్ల ఎల్లయ్య తన ప్రత్యర్థి వడ్లకొండ వెంకటేశ్‌పై ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. మానకొండూర్ మండలం ముంజంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎలుపుగొండ కొమురమ్మ కాంగ్రెస్ బలపర్చిన నందగిరి కనకలక్ష్మిపై రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ ఓట్ల లెక్కింపు మొదట టై కాగా, రెండోసారి ఓట్లు లెక్కించగా రెండు ఓట్ల తేడాతో కనకలక్ష్మి గెలిచారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాషాగూడెంలో జరిగిన పోలింగ్‌లో 328 ఓట్లు పోలైయ్యాయి. ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండగా, చెరి సగం 164 చొప్పున ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థులు సయ్యద్ హఫీజ్ (బీఆర్ఎస్), సయ్యద్ సత్తార్(కాంగ్రెస్) ఇద్దరి మధ్య ఎన్నికల అధికారులు టాస్ వేయగా సయ్యద్ సత్తార్ గెలుపొందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మలో మొత్తం 2,085 ఓట్లకు 1,943 ఓట్లు పోల్ కాగా.. 39 ఓట్లు చెల్లుబాటు కాలేదు. 10 ఓట్లు నోటాకు పడగా.. 947 బీఆర్ఎస్కు, 947 కాంగ్రెస్‌కు వచ్చాయి. దీంతో అధికారులు డ్రా పద్ధతిని ఎంచుకున్నారు. డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు అధికారులు ప్రకటించి ధ్రువీకరణపత్రం అందజేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పోలింగ్ కేంద్రంలో గలాటా సృష్టించారు.