హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఒక చాన్స్ అంటూ అధికారం చేజికించుకున్న సీఎం జగన్ పాలనలో ఏపీ ప్రజానీకం దగా పడిందని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఏపీ బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో గుంటూరు జిల్లాకు చెందిన మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లాం ప్రకాశ్, అనంతపురం జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కనీస అవసరాలు తీర్చలేని వైసీపీ నేతలను ప్రజలు తరిమికొడుతున్నారని చెప్పారు. సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేండ్లలో అన్ని రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి ఏపీలో జరగాలని ప్రజలు కోరుకుంటున్నట్టు చెప్పారు. పార్టీలో చేరిన వారిలో అనంతపురానికి చెందిన ఎండీ రహమతుల్లా, అలీ అహ్మద్, ఎండీ ఇబ్రహీం, న్యాయవాది ఎండీ ముజాఫర్ సమీ, నిరసనమెట్ల శ్రీనాథ్, మహ్మద్ హమద్, కురుబ నాగరాజు, సమత ఖాన్, ఎండీ సాజిద్షా, ఎండీ మిరాజ్, మొహమ్మద్ ఇర్ఫాన్, ఫిరోజ్‌ఖాన్, షేక్ అహ్మద్, నరసరావుపేటకు చెందిన దేవసహాయం సహా పలు జిల్లాల నాయకులు ఉన్నారు.