హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) యూత్, విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. వారిని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని వివిధ స్టేషన్లను తరలిస్తున్నారు. కొన్ని రాజకీయశక్తులు, కొచింగ్ సెంటర్ల యాజమాన్యాలే పరీక్షల వాయిదా కోరుతున్నాయని, నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామంటూ జేఎన్టీయూ వేదికగా ముఖ్యమంత్రి నోరుపారేసుకున్నారు. దీంతో సీఎం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ అభ్యర్థులు అర్ధరాత్రి వేళ రోడ్డెక్కారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్తోపాటు, ఇతర అనేక చోట్ల వేలాది మంది ఉద్యోగార్థులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అభ్యర్థుల ధర్నాలతో ఎక్కడికక్కడ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాగా, ఆదివారం ఉదయం ఉస్మానియా యూనిర్సిటీ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థి నాయకులకు పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో పర్యటనకు వస్తుండటంతో పోలీసులు విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ యూత్ విభాగానికి చెందిన నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీగా పోలీసులను మోహరించారు. ఆ మార్గం గుండా వెళ్లే ఆర్టీసీ బస్సులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీంతో ముందస్తు అరెస్టులు లేకుండా, పోలీసులు రక్షణ లేకుండా ఒక్క అడుగుకూడా బయట పెట్టలేని సీఎం నువ్వేనేమో అంటూ ఉద్యోగార్థులు విమర్శిస్తున్నారు.
