మిర్యాలగూడ, ఆగస్టు 31 : అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, ఇది అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. సోమవారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బీఆర్ఎస్ కా ర్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డితో కలిసి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. 3న మిర్యాలగూడలో చేపట్టే రైతు సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు. సాగర్‌లో నీరున్నా రైతాంగానికి ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు. రైతులకు సాగునీరందిస్తే ఎరువు లు అడుగుతారని, 24గంటల కరెంట్, పండించిన పంటకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని భయపడి.. సాగర్ నుంచి నీరు ఇవ్వలేమని రైతులను మోసగిస్తున్నారని ఆరోపించారు. సాగర్ జలాలు ఆంధ్రాకు తరలిపోతున్నా అడ్డుకోలేని అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు.
ఇక్క డి మంత్రుల అసమర్థత వల్లే ఇప్పటికే 150 క్యూసెక్కుల నీరు ఆంధ్రాకు తరలిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ కాప లా ఉండి.. ఏపీకి నీటిని విడుదల చేయిస్తున్నారని విమర్శించారు. గతంలో సాగర్‌లో నీటిమట్టం 512 అడుగుల మేర ఉన్నా.. రైతాంగం నష్టపోవద్దని సాగునీరందించామని, ఇప్పుడు 530 అడుగులు న్నా రైతులకు సాగునీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో వరుసగా 17సార్లు సాగునీరందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే నిరసనల్లో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కోరారు.