అర్వపల్లి/సూర్యాపేట, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్‌లో బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతుపై కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. కాసర్లపహాడ్‌కు చెందిన మెండె సురేశ్ గ్రామ శివారులోని సొంత భూమిలో డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తూ తోట వద్ద ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. సురేశ్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, పార్టీ బహిరంగ సభల్లో విచిత్ర వేషధారణలతో ప్రభుత్వ పథకాలను తన ఒంటిపై రాసుకొని కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకునేవాడు.
కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు షేర్ చేస్తున్నాడనే కారణంతో.. పది మంది హస్తం పార్టీ నాయకులు గురువారం మధ్యాహ్నం తన భార్యతో కలిసి తోట పనులు చేసుకుంటున్న సురేశ్‌పై కర్రలతో దాడి చేశారు. అడ్డుకోబోయిన భార్యపైనా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ సురేశ్‌ను స్థానికులు, బీఆర్ఎస్ నాయకులు సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి సూర్యాపేట జనరల్ దావఖానకు వెళ్లి సురేశ్ దంపతులను పరామర్శించారు.
దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే బీఆర్ఎస్ నేతలపై ఆ పార్టీ గూండాలు దాడులకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. ఘర్షణలు తెలంగాణ సమాజానికి మంచిది కాదని, అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తమ పదేండ్ల పాలనలో రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా చేశామని, చిన్నా చితక జరిగినా పార్టీలకతీతంగా వ్యవహరించి ఆదిలోనే అణిచివేశామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో రాజకీయ దాడులను ఆపాల్సిన బాధ్యత జిల్లా మంత్రులది, పోలీసు అధికారులదేనని, ఘర్షణలు అదుపు చేయడంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.
బీఆర్ఎస్ నాయకుడు మెండే సురేశ్‌పై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు రైతుబంధు నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సురేశ్‌పై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, గ్యాదరి కిశోర్ దవాఖానలో సురేశ్‌ను పరామర్శించారని, త్వరలో తాను తుంగతుర్తికి వెళ్లి కలుస్తానని కేటీఆర్ తెలిపారు.