కొణిజర్ల, ఏప్రిల్ 14 : పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఓ బీఆర్ఎస్ కార్యకర్త సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో సోమవారం చోటుచేసుకుంది. రామనర్సయ్యనగర్కు చెందిన బాధితుడు జటపిట రవి సెల్ఫీ వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం.. మల్లుపల్లికి చెందిన ఓర్సు నరసింహారావు కొణిజర్లకు చెందిన ఓ బాలికను తీసుకుని వెళ్లాడు. బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా రవిని పోలీసులు స్టేషన్‌కు పిలిచారు. కొణిజర్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడితోపాటు మరో ఇద్దరు, పోలీసులు తనను బీఆర్ఎస్ కార్యకర్త అనే కారణంతో కేసులో ఇరికించాలని చూస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సెల్ఫీ వీడియోలో రవి పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో ఆ వీడియో చూసిన కుటుంబసభ్యులు రవిని వెతికి ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
విచారణకోసమే స్టేషన్‌కు పిలిచాం: ఏసీపీ
విచారణ కోసమే రవిని స్టేషన్‌కు పిలిచారని వైరా ఏసీపీ రెహమాన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జటపట రవి వద్ద ట్రాలీ డ్రైవర్‌గా పనిచేస్తున్న నరసింహారావు ఏప్రిల్ 8న తమ కూతురును కిడ్నాప్ చేశారని ఆ బాలిక తల్లిదండ్రులు 10వ తేదీన ఫిర్యాదు చేయగా కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రవి తన బైక్ నరసింహారావుకు ఇచ్చి కిడ్నాప్‌నకు సహకరించినట్టు ఆరోపించడంతో ఎస్సై కేసు విచారణలో భాగంగా సోమవారం రవికి ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని సూచించారు. కిడ్నాప్ కేసుతో తనకు సంబంధం లేదని రవి ఫోన్‌కట్ చేసి.. పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియా వేదికగా పోస్టుచేశారని వెల్లడించారు. కొణిజర్ల ఎస్సై సూరజ్‌ను వివరణ కోరగా బాలికను అపహరించిన విషయమై తన బైక్ ఇచ్చి పంపినట్టుగా ప్రాథమిక విచారణలో తేలడంతో రవిని స్టేషన్‌కు పిలిచామని, ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని వివరించారు.