నకిరేకల్, జూన్ 27 : సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడనే నెపంతో కార్యకర్తను నకిరేకల్ పోలీస్టేషన్లో నిర్బంధించగా బీఆర్ఎస్ నాయకులు చేరుకొని ఆందోళన చేపట్టారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నందికంటి నాగేంద్రబాబు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టుపై మంగళపల్లికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నాగేంద్రబాబు ఫోన్ సిగ్నల్‌ను ట్రాప్ చేసి శుక్రవారం నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకవచ్చారు. ఎటువంటి కేసుపెట్టకుండా ఆరుగంటలపాటు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు.
అకారణంగా కార్యకర్తను పోలీస్టేషన్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నవీన్‌రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ధర్నాకు దిగారు. సీఐ రాజశేఖర్ నవీన్‌రావుపై చేయిచేసుకోగా కార్యకర్తలు, నాయకులు పోలీసులతో వాదనకు దిగారు. దళితుడు, దివ్యాంగుడు అనికూడా చూడకుండా నాగేంద్రబాబు ఫోన్ లొకేషన్ సిగ్నల్ ట్రేస్ అవుట్ చేసి మరీ పట్టుకుని స్టేషన్‌కు తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు.