హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అక్రమ వ్యవహారాలు, కుంభకోణాలపై విచారణ జరుపాలని, నిజాలు నిగ్గుతేల్చాలని ప్రతిపక్షాలు అసెంబ్లీలో, బయట రేవంత్‌రెడ్డి సర్కార్‌ను నిలదీస్తున్నాయి. రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి మొదలుపెట్టి తాజాగా వెలుగులోకి వచ్చిన కార్మిక బీమా కుంభకోణం వరకు వెలుగుచూసిన అవినీతిని ప్రతిపక్ష నేతలు ఆధారాలతో ప్రజల ముందు ఉంచారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి మాదిరిగానే డైవర్షన్ డ్రామాను నమ్ముకున్నది. ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై విచారణ జరిపేందుకు సమ్మతిస్తున్నట్టు ప్రకటిస్తూనే.. ఆ దర్యాప్తు పరిధిని బీఆర్ఎస్ పాలననాటికి విస్తరిస్తున్నది. ఆరోపణల దిశను దారి మళ్లిస్తున్నది. ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాల నిగ్గుతేల్చి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి, పదేండ్ల కిందటి రికార్డులను తెరపైకి తెస్తున్నది. వర్తమాన లూటీని కమిటీల మాటున తొకిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.
బీమా క్లెయిమ్ అక్రమాలు బయటపెడితే..
కార్మికుల బీమాకు సంబంధించి ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత, పాక్షిక వైకల్య బీమా పథకాలను కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర కార్మికశాఖ నిర్వహించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బాధ్యతలను ముంబైకి చెందిన ‘ట్రెయిల్ బ్లేజర్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీకి అప్పగించింది. ఈ మేరకు నిరుడు జూన్ 22న జీవో 12 విడుదల చేసి, గోప్యంగా ఉంచింది. బీమా నిర్వహణ అప్పగించిన రెండు రోజుల్లోనే ట్రెయిల్ బ్లేజర్ బ్రోకర్ కంపెనీ ఖాతాలోకి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.346 కోట్లు జమ చేసింది.
ఈ నిర్ణయంపై ‘నమస్తే తెలంగాణ’ లోతుగా పరిశీలించగా ట్రెయిల్ బ్లేజర్ ఓ అనామక కంపెనీగా తేలింది. దీని అధీకృత వాటా మూలధనం కేవలం రూ.3 కోట్లుగా, చెల్లింపు మూలధనం రూ.2.50 కోట్లు మాత్రమే ఉన్నది. ఇంత చిన్న కంపెనీకి రూ.వందల కోట్ల కార్మిక బీమా బ్రోకరేజీ వ్యవహారాలు కట్టబెట్టడం, ప్రైవేట్ సంస్థకు కట్టబెడితే బీమా చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ‘నమస్తే తెలంగాణ’ సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు వరుస కథనాలు ప్రచురించింది.
తాజాగా కార్మికుల బీమా సొమ్ములో ఏకంగా రూ.150 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయనే సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కార్మిక శాఖ అంతర్గత విచారణ ప్రారంభించి, వరంగల్ రీజియన్ జాయింట్ కమిషనర్‌ను విచారణాధికారిగా నియమించింది. ప్రాథమిక దర్యాప్తులో రూ.10 కోట్లకు పైగా బోగస్ క్లెయిమ్‌లు తేలడంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. రూ.150 కోట్ల అక్రమాల వ్యవహారం పూర్తిగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి సంబంధించింది. కార్మిక శాఖ బోర్డుకు చెందిన కీలక అధికారి, ప్రభుత్వ పెద్దల పాత్రపై ఆరోపణలున్నాయి. కార్మిక బీమా క్లెయిమ్‌లలో జరిగిన రూ.150 కోట్ల అవినీతి మీద విచారణ జరుపాల్సిందిపోయి ప్రభుత్వం విచారణ పరిధిని 2018-19 నాటి సంక్షేమ పథకాలు, అప్పటి చెల్లింపుల దాకా విస్తరించింది. డైవర్షన్ డ్రామా మొదలు పెట్టింది.
మైనింగ్ శాఖలోనూ ఇదే ధోరణి
మైనింగ్ శాఖలోనూ ఇదే విచిత్ర ధోరణిని ప్రభుత్వం ప్రదర్శించింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా అక్రమ క్వారీయింగ్ చేస్తున్నదని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆధారాలతో శాసనసభ వేదికగా బయటపెట్టారు. సదరు సంస్థపై నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని అప్పట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే వివాదం అకడితో ఆగలేదు. కాంగ్రెస్ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా పెరిగాయని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నదని బీఆర్ఎస్ ఆరోపించింది. 2025 మార్చిలో ఇసుక ఆదాయ లావాదేవీలను అఖిలపక్ష ఎమ్మెల్యేల కమిటీతో ఆడిట్ చేయాలని డిమాండ్ చేసింది.
కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన మైనింగ్ లీజులు, అక్రమ తవ్వకాలు, ఇసుక అక్రమాలన్నింటిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉంటే చట్టపరమైన విచారణ జరుపడం పాలనాపరమైన హకే అయినా, నేటి ప్రభుత్వంలో మంత్రులు, అధికార యంత్రాంగంపై వస్తున్న తాజా ఆరోపణలను పాత దర్యాప్తుల ముసుగులో కప్పిపుచ్చాలని చూడటం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
22ఏ విషయంలోనూ అదే తీరు
రాష్ట్రంలో 22ఏ భూములపై ఎంత వివాదం చెలరేగిందో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా సర్వే నంబర్లను 22ఏ జాబితాలో చేర్చారని, దాని ఆధారంగా సామాన్యులు, ప్లాట్ల యజమానులను వేధిస్తున్నారని, తెరవెనుక రియల్టర్లతో భారీ సెటిల్మెంట్లు సాగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ ఆరోపించారు. బాధితుల వద్దకు వెళ్లి వారికి జరిగిన అన్యాయాన్ని నేరుగా ప్రభుత్వానికే చూపించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సెప్టెంబర్ 24న ఒక ఉన్నతస్థాయి విచారణ కమిటీని ప్రకటించింది.
కానీ ఆ కమిటీకి నిర్దేశించిన పరిధిని గమనిస్తే అసలు మతలబు అర్థమవుతుంది. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న 22ఏ నిర్ణయాలవల్ల ప్రజలు ఎదురొంటున్న ఇబ్బందులను తేల్చడం కన్నా, విచారణ పరిధిని బీఆర్ఎస్ పాలనా కాలానికి విస్తరించింది. బయటికి మాత్రం 22ఏ నిషేధిత భూముల మీద విచారణ కమిటీ వేస్తున్నట్టు చెప్పిన ప్రభుత్వం.. తీరా దాన్ని మళ్లీ గత పాలకుల వద్దకే తీసుకెళ్లడం కేవలం డైవర్షన్ డ్రామా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నేటికీ రిజిస్ట్రేషన్ శాఖలో సాగుతున్న గందరగోళంపై సమాధానం చెప్పకుండా, దర్యాప్తును గత పాలకుల ఆస్తుల వేట వైపు మళ్లించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.