జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, పోలీస్, ఎన్నికల యంత్రాంగాలు పనిచేసిన తీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి. మా అభ్యర్థి సునీత రాజకీయానుభవం లేకున్నా.. శక్తివంచన లేకుండా పోరాటం చేశారు. -కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమితో నిరాశ చెందబోమని, మరింత బలంగా పుంజుకుంటామని, బంతిలా వేగంగా దూసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ఈ ఉప ఎన్నిక కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఇది తమకు సానుకూల అంశమని చెప్పారు. 2014 నుంచి 2023 వరకు ఏడు ఉప ఎన్నికలు జరిగితే అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ ఒక్కటీ గెలవలేదని గుర్తుచేశారు. ఒక ఉప ఎన్నికల్లో గెలవకపోయినా, డిపాజిట్లు కోల్పోయినా అప్పటి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లోనే ఉంటూ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసుకునేదాకా పోరాటం సాగిస్తామని స్పష్టంచేశారు.
ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, పోలీస్, ఎన్నికల యంత్రాంగాలు పనిచేసిన తీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు అనుభవం లేకపోయినా కష్టపడి గెలుపుకోసం శక్తివంచన లేకుండా పోరాటం చేశారని అభినందించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన ప్రతి ఒకరికీ, వారికి తోడుగా ప్రతి బూత్‌లో పనిచేసిన జూబ్లీహిల్స్ పార్టీ శ్రేణులు, నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం తెలంగాణభవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలో బీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రతి ఒక ఓటరుకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
డిపాజిట్ కోల్పోయిన బీజేపీ
జూబ్లీహ్లిల్స్ ఉప ఎన్నికలో సింగిల్ డిజిట్లో ఉండి బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోయిందని కేటీఆర్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి, సంజయ్ (ఆర్ఎస్) బ్రదర్స్ సమీకరణం బాగానే వరౌట్ అయినట్టు కనిపించిందని ఎద్దేవా చేశారు.
ఎన్నిక జరిగిన తీరుపై చర్చ జరగాలి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, పోలీస్, ఎన్నికల యంత్రాంగాలు పనిచేసిన తీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ చెప్పారు. ‘గెలవాల్సింది పార్టీలు కాదు, గెలవాల్సింది ప్రజలు అని నమ్మే పార్టీ మాది. ఈ ఎన్నిక ఏ విధంగా జరిగిందో ప్రజల్లో, మీడియాలో చర్చ జరగాలి. ఎన్ని రకాలుగా అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్నదో నెల రోజుల ముందే చెప్పినం. స్వయంగా అభ్యర్థి తమ్ముడికి దొంగ ఓట్లు ఉండటం, దొంగ ఓటరు కార్డుల పంపిణీ, షెడ్యూల్ మొదలు పోలింగ్ రోజు వరకు జరిగిన అక్రమాల గురించి ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు చేసినం. నిబంధనల ఉల్లంఘనపైనా ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసినం. ఎలక్షన్ కమిషన్ ఈ విజిల్ యాప్ పనిచేయలేదు. ఎలక్షన్ కమిషన్, పోలీస్ వ్యవస్థ పనితీరుపై చర్చ జరగాలి. ఈ విధంగా ఎన్నికలు జరిగిన తీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా ప్రజా తీర్పును మేం గౌరవిస్తం. ఈ ఎన్నిక ఫలితంపైనా ఆత్మ విమర్శ చేసుకుంటం. మరింత ఓటింగ్ జరిగి ఉండాల్సింది. మాకు ఈ ఎన్నికలో మంచి ఓటింగ్ వచ్చింది’ అని చెప్పారు.
ఉప ఎన్నికకే ఇన్ని ఆపసోపాలు.. పది వస్తే?
ఈ ఉప ఎన్నిక ఓటమితో నిరాశ చెందాల్సిన అవసరం లేదని, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ప్రతి ఒకరం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పనిలో నిమగ్నమై ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన మాదిరి ఇకడ కూడా పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు ప్రకటిస్తారని, ఉప ఎన్నికలు వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకే ఇన్ని ఆపసోపాలు పడిన కాంగ్రెస్ పార్టీ, 10 ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదురొంటుందో చూస్తామని, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బలంగా కొట్లాడతామని ధీమా వ్యక్తంచేశారు. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితిలో ప్రజలు తీర్పునిచ్చారని దుయ్యబట్టారు.
శక్తివంచన లేకుండా పనిచేసిండ్రు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ నాయకులు శక్తివంచన లేకుండా పనిచేశారని కేటీఆర్ చెప్పారు. ‘మా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తండ్రి మరణం తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఇంటి నుంచి ఎన్నికల కోసం పనిచేసిండ్రు. మా పార్టీ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు సోదరుడు చనిపోయిన తర్వాత ఒక్క రోజులోనే పార్టీ ప్రచారంలో పాల్గొన్నరు. దీపావళి పండుగను సైతం పకనపెట్టి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక పార్టీ నేతకు, కార్యకర్తకు ధన్యవాదాలు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయినం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుదాం. కేసీఆర్ మీద అభిమానంతో సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకొచ్చిన మా కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని కేటీఆర్ చెప్పారు.
సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రావుల శ్రీధర్‌రెడ్డి, చిరుమామిళ్ల రాకేశ్, మేడే రాజీవ్‌సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, వాసుదేవరెడ్డి, పల్లె రవిగౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను, మోసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయామని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బూతులు మాట్లాడినా, ప్రచారం సందర్భంగా తాము హూం దాగా ఉన్నామని తెలిపారు. ‘పదేండ్లు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీగా మేము చేసిన అభివృద్ధిని చూపించినం. రూ.5,300 కోట్లతో చేసిన అభివృద్ధిని నియోజకవర్గ ప్రజల ముందు పెట్టినం. బస్సు చార్జీల పెంపుపై నిరసన, బస్తీ దవాఖానల్లో పర్యటించి ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తీసుకొచ్చినం. హైడ్రా విధ్వంసంపై ప్రభుత్వాన్ని ఎండగట్టినం. ఆటో అన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినం. హైదరాబాద్‌లో రోడ్ల దుస్థితిపైనా ప్రభుత్వాన్ని కదిలించినం. శాంతిభద్రతల విషయంలో సర్కా రు విఫలం కావడంపైనా మా నిరసన తెలిపినం’ అని గుర్తుచేశారు. ప్రజా సమస్యలనే కేంద్ర బిం దువుగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని హూం దాగా నిర్వహించిందని చెప్పారు. రెండేండ్ల్లలో ఒకసారీ సమీక్షించని సీఎం.. ఆఖ రి రోజు ఆరు గ్యారెంటీల మీద సమీక్ష చేసే పరిస్థితి వచ్చిందంటే అది బీఆర్ఎస్ విజయమేనని చెప్పారు. మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానమే లేదని నిలదీస్తే అజారుద్దీన్‌కు సర్కారు క్యాబినెట్లో స్థానం కల్పించాల్సివచ్చిందని పేర్కొన్నారు.
ప్రజల్లోనే ఉంటం
తెలంగాణకు బీఆర్ఎస్యే ప్రత్యామ్నాయమని ప్రజలు నిరూపించారని కేటీఆర్ చెప్పారు. ‘ఈ ఎన్నికల ఫలితం వల్ల నిరాశ చెందబోం. మా పనిని ప్రధాన ప్రతిపక్షంగా చేసుకుంటూ పోతం. ప్రజలతోనే ఉంటం. ప్రజల కోసమే ఉంటం. ప్రజల్లోనే ఉంటం. తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసుకునేదాకా పోరాటం చేస్తూనే ఉంటం. రెండేండ్లుగా లగచర్ల నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక అరాచకాలను, అక్రమాలను, అవినీతిని ఎండగడుతూనే ఉన్నం. సోషల్ మీడియా ద్వారా ఎకడికకడ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను, అవినీతిని ఎండగడుతున్న ప్రతి ఒక సోషల్ మీడియా వారియర్‌కు, ప్రతి ఒక పార్టీ కార్యకర్తకు, పార్టీ నేతలందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నం’ అని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయం మేమే
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమ పార్టీకి గణనీయమైన ఓటు శాతం నమోదైందని కేటీఆర్ చెప్పారు. ప్రతి ఎన్నికల్లో గెలవాలని పోటీ చేస్తామని, రాష్ట్రంలో స్పష్టమైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సేనని ఈ ఎన్నికల ద్వారా ప్రజలు తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని తమ పార్టీ సానుకూలంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. ‘2014 నుంచి 2023 వరకు ఏడు ఉప ఎన్నికలు జరిగాయి. అన్ని ఉప ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్నికల్లోనూ గెలవలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఒకటి, రెండు సీట్లకే పరిమితమైంది. ఒక ఉప ఎన్నికలో గెలవకపోయినా, డిపాజిట్లు కోల్పోయినా అప్పటి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చింది’ అని గుర్తుచేశారు.
ఉప ఎన్నికలో మా పార్టీ నాయకులు మనసుపెట్టి పనిచేసిండ్రు. దీపావళి పండుగను సైతం పకనపెట్టి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేసిన
ప్రతి ఒక పార్టీ నేతకు, కార్యకర్తకు ధన్యవాదాలు. ఈ ఎన్నికల ఫలితాలతో కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయినం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుదాం..
-కేటీఆర్
ఎన్నికలో లబ్ధి కోసం కులం, మతం పేరుతో మేము డైవర్షన్ రాజకీయాలు చేయలేదు. ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడం, సర్కారు మోసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయినం. ప్రజలకు అవసరమైన అంశాలను మాత్రమే ప్రచారంలో చర్చకు పెట్టినం. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు బూతులు మాట్లాడినా ప్రచారం సందర్భంగా మేము హూందాగా ఉన్నం.
-కేటీఆర్
రెండేండ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ నిజాయితీగా, చిత్తశుద్ధితో పోరాడింది. జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ గెలుస్తుందని దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు చెప్పినయి. ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రతి ఒక ఓటరుకు, ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు.
-కేటీఆర్