హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో బ్రోకర్ల జోక్యం తీవ్ర వివాదాస్పదమవుతున్నది. మెడికల్ ఏజెన్సీలకు (Medical Agency) బిల్లులను క్లియర్ చే సే విషయంలో ఓ మంత్రికి సన్నిహితులం అని చెప్పుకుంటూ నలుగురు ప్రైవేటు వ్యక్తులు ఓ టీంలా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల సంస్థ (TGMSIDC) కీలకాధికారిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న ది. నిబంధలన్నీ పక్కనపెట్టి తాము చెప్పిన మెడికల్ ఏజెన్సీల బిల్లులు ముందుగా క్లియర్ చేయాలని సదరు టీం హుకుం జారీచేసినట్టు సమాచారం. ప్రభుత్వ దవాఖానలకు మందులు సరఫరా చేసే మెడికల్ ఏజెన్సీలకు సర్కారు బిల్లులను చెల్లిస్తుంది. ఇందుకు ప్రతి నెల రూ.50 కోట్లు కేటాయిస్తున్నది.
కీలకాధికారిపై ఒత్తిడి, వేధింపులు
తాము చెప్పిన మెడికల్ ఏజెన్సీలకు ముందుగా బిల్లులు క్లియర్ చేయాలని ఆ నలుగురు ప్రైవేటు వ్యక్తులు కీలకాధికారిపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. ఇందుకు సదరు కీలకాధికారి ససేమిరా అనడంతో ఆ నలుగురు వేధింపులకు దిగుతున్నట్టు సమాచారం. టీజీఎంఎస్ఐడీసీపై ఆధిపత్యం చేలాయించేలా ప్రైవేటు వ్యక్తులు వ్యవహరించడం తీవ్ర దుమారం రేపుతున్నది. కీలకాధికారి కన్నా ముందు టీజీఎంఎస్ఐడీసీలో పనిచేసిన అధికారిని సైతం ఈ నలుగురు ఒత్తిళ్లకు గురిచేసి 18నెలలపాటు తమ వారి బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా క్లియర్ చేయించుకున్నట్టు తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా ఆరు శాతం కమిషన్ వసూలు చేసినట్టు సమాచారం.
కిందిస్థాయి అధికారిపై జులుం
టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో ఓ కిందిస్థాయి అధికారిపై సైతం ఆ నలుగురు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం. బిల్లులను క్లియర్ చేసే సమయంలో ఆయా మెడికల్ ఏజెన్సీల నుంచి తమకు రావాల్సిన పర్సంటేజీని వసూలు చేసి ఇవ్వాలని తాజాగా హుకుం జారీచేసినట్టు తెలిసింది. ఆ కిందిస్థాయి అధికారి పదవి వచ్చే ఏడాది మార్చితో ముగియనుండటంతో ఈ ఒత్తిళ్ల ధాటికి బెంబేలేత్తుతున్నట్టు తెలిసింది. ఇటీవల ప్రభుత్వ పెద్దల వేధింపుల కారణంగా ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవడం దుమారం రేపగా.. టీజీఎంఎస్ఐడీసీలోనూ ప్రైవేటు వ్యక్తులు ఒత్తిళ్లకు దిగడం సంచలనంగా మారింది.