హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖలో అవినీతి తారస్థాయికి చేరిపోయింది. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం తూతూమంత్రం చర్యలతో సరిపెట్టడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. వైద్యారోగ్యశాఖలో అవినీతి జరిగినా ఎవరూ పట్టించుకోరులే అనే ధీమాతో దందాలకు దిగుతున్నారు. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రాజకీయనేతలు, అధికారు లు కుమ్మక్కయి దళారుల అవతారం ఎత్తా రు. నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారని వైద్యారోగ్యశాఖవర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో దళారులను నమ్మవద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగా ల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మరోవైపు మంత్రి స్పందించి ప్రకటన చేయాల్సి వచ్చిందంటే ఈ దందా ఏ స్థాయి లో జరుగుతున్నదో అర్థమవుతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎవరేం చేస్తారులే అనే ధీమా!
వైద్యశాఖలో వరుసగా అవినీతి ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అవినీతి యథేచ్ఛగా సాగిపోతున్నది. డిప్యూటేషన్ల కోసం డబ్బులు తీసుకుంటున్నారంటూ ఓ ఉన్నతాధికారిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదు. బదిలీల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ ఎంక్వయిరీ అంటూ మంత్రి హడావుడి చేసినా ఆ విచారణ ఏమైందో ఎవరికీ తెలియదు. వరుసగా అవినీతి ఆరోపణలు వచ్చినా విచారణలు జరిగినా చర్యలు శూన్యం కావడంతో వైద్యారోగ్యశాఖలో అక్రమాలకు అడ్డుకట్టపడటం లేదు.
‘108’ని పటిష్టం చేస్తాం: దామోదర
108 సేవల పటిష్టానికి ప్రభుత్వం చర్య లు చేపట్టిందని మంత్రి దామోదర పేర్కొన్నారు. 108 నంబర్‌కు సమాచారం రాగానే మిషన్ ఆఫ్ సేవింగ్ లైవ్స్‌లో భాగంగా ఘ టనా స్థలానికి చేరకుని బాధితులను దవాఖానకు తరలిస్తారని తెలిపారు. అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స చేసి దవాఖానలో మెరుగైన చికిత్స అందించేలా నెట్వర్క్ రూపొందిస్తున్నామని చెప్పారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో గుండెపోటుకు గురైన వ్యక్తిని 108 డ్రైవర్ మధ్యలోనే వదిలేసిన ఘటనపై మంత్రి స్పందించారు. దీనిపై విచారణ చేపట్టాలని 108 సీవోవో ఖలీద్‌ను ఆదేశించారు.