హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పోలీస్‌శాఖలో ప్రమోషన్ల విషయంలో గందరగోళానికి తెరదించాలని, అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పీ సబితాఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆమె శాసనసభలో మాట్లాడారు. 2009 బ్యాచ్ ఎస్సైలకు సీఐలుగా గత కేసీఆర్ సర్కార్ ఉద్యోగాలిచ్చిందని తెలిపారు. ఇదే బ్యాచ్‌లో సుమారు 80 మంది వరకు ప్రమోషన్లు కల్పించాల్సి ఉన్నదని పేర్కొన్నారు.
ఒకే బ్యాచ్‌లోని వారు సీఐలుగా పనిచేస్తూ ప్రస్తుతం డీఎస్పీ ప్రమోషన్లకు రెడీ అవుతుండగా, అదే బ్యాచ్‌కు చెందిన వారు ఇంకా ఎస్సైలుగా పనిచేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అలాంటి వారికోసం పోస్టులు లేకుంటే సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ వారికి బాధిత ఎస్ఐలకు న్యాయం చేయాలని కోరారు. మల్టీజోన్-2లో ఉన్నవారికి త్వరగా ప్రమోషన్లు వస్తున్నాయని, మల్టీజోన్-1 అధికారులు, ఉద్యోగులకు రావడంలో ఆలస్యమవుతుందని తెలిపారు. 91, 95, 96 బ్యాచ్‌లకు ఎస్సైల సీనియారిటీ, ప్రమోషన్లు విషయంలో తేడాలున్నాయని వివరించారు. మల్టీజోన్-1 పరిధిలో ప్రమోషన్లపై పున:సమీక్షించాలని, సీనియారిటీని నిర్ధారించి ప్రమోషన్లలో ఇబ్బందుల్లేకుండా చూడాలని కోరారు.
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి నాడు కేసీఆర్ కృషి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేశారని సబితాఇంద్రారెడ్డి కొనియాడారు. హోంగార్డులకు ఉన్న రూ.9వేల గౌరవ వేతనాన్ని రూ.27 వేలకు పెంచారని, ట్రాఫిక్‌లో పనిచేసే పోలీస్ అధికారులు, సిబ్బందికి 30 శాతం అలవెన్స్, మహిళా హోంగార్డులకు మెటర్నిటీ లీవులు మంజూరు చేసినట్టు గుర్తుచేశారు. మన పోలీస్ శాఖకు దేశంలోనే నంబర్‌వన్‌గా పేరున్నదని, మన పోలీసులు దేశంలో మొదటిస్థానంలో ఉంటారన్నది ఎవరూ కాదనలేని సత్యమని పేర్కొన్నారు.
పోలీసులున్నారన్న నమ్మకం, భరోసాతోనే మనం రాత్రి ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని చెప్పారు. ఆఖరుకు భార్యభర్తలు కొట్లాడుకున్నా పోలీస్‌స్టేషనే గుర్తుకొస్తుందని తెలిపారు. ‘అందరి ఇండ్లకు తాళాలేసుకుంటాం కానీ, తాళం వేయకుండా 24 గంటలు పనిచేసేది ఒక్క పోలీస్‌స్టేషన్ మాత్రమే’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి శాఖలో ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వమే చొరవ చూపాలని కోరారు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామన్న హామీ ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని సబితాఇంద్రారెడ్డి నిలదీశారు. సహజమరణం పొందిన హోంగార్డు కుటుంబాలకు రూ.5 లక్షల బీమా కోసం జీవో ఇచ్చి 10నెలలు గడిచినా అమలు చేయడం లేదని ఆరోపించారు. కారుణ్య నియామకాలు కలగానే మిగిలాయని, హోంగార్డులకు రిటైర్మెంట్ అయ్యాక పెన్షన్ సౌకర్యం అందడంలేదని పేర్కొన్నారు.
15లక్షల మంది వేచిచూస్తున్నారు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
పోలీస్ ఉద్యోగాల కోసం రాష్ట్రంలోని 15 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు రెండేండ్లుగా వేచిచూస్తున్నాని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో గళమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రెండేండ్లకోసారి పోలీస్ ఉద్యోగాలను భర్తీచేసిందని గుర్తుచేశారు. 2016 లో 15,600, 2018లో 15 వేలు, 2022లో 15వేల చొప్పున మొత్తంగా 45 వేల ఉద్యోగాలను భర్తీచేసినట్టు వివరించారు. ఖాళీలున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో ఒక్క ఉద్యోగాన్నీ భర్తీచేయలేదని విమర్శించారు. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారని సర్కార్‌ను ప్రశ్నించారు. పోలీసులకు ఈహెచ్ఎస్ వర్తించదా? లేక ఆరోగ్యభద్రతను వర్తింపజేస్తారా? అన్నది స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ సరెండర్ లీవుల బకాయిలు ఆదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెంలో అందడంలేదని ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. వీటిని వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
హోంగార్డుల పక్షాన సబితాఇంద్రారెడ్డికి ధన్యవాదాలు
తమ సమస్యలను శాసనసభలో లేవనెత్తిన మాజీ హోంమంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత సబితా ఇంద్రారెడ్డికి హోంగార్డుల కుటుంబాలు గురువారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపాయి. హోంగార్డుల సమస్యలు పరిషరించాలని, వారి సేవలను గుర్తించి గౌరవాన్ని ఇవ్వాలని, కారుణ్య నియామకాలు, హెల్త్‌కార్డులు, సహజ మరణం కింద రావాల్సిన నగదు, ఇతర సదుపాయాల గురించి శాసనసభలో మాట్లాడినందుకు సబితా ఇంద్రారెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు. కానిస్టేబుళ్లు, హోంగార్డుల సమస్యలను త్వరగా పరిషరించాలని కోరిన ఎమ్మెల్యే కూనంనేనికి సైతం వారు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా తమ సమస్యల పరిష్కారంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ దాటవేత ధోరణిని వీడాలని వేడుకున్నారు. తమకు రావాల్సిన సదుపాయాలను సకాలంలో అందజేయాలని మరణించిన హోంగార్డుల కుటుంబాలు మంత్రికి విన్నవించాయి.
ప్రజల కోసం బరాబర్ అడుగుతాం
హైదరాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ): ప్రజలకు ఇబ్బందులు ఉంటే ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి ఇచ్చిందన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. మంత్రి పదవి ఊరికే ఇవ్వలేదని, పార్టీకి చేసిన సేవలకే గుర్తింపుగా ఇచ్చారని గుర్తుచేశారు. సీతక్క పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినట్టుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌లో తనకు మంత్రి పదవి వచ్చిన మాట వాస్తవమేనని, అదే సమయంలో ఐదు సీబీఐ కేసులు కూడా తనపై నమోదయ్యాయని తెలిపారు. మంత్రి సీతక్క అంటే గౌరవం ఉన్నదని, అనవసరంగా తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాల్లో కనీసం తాగునీరు రావడం లేదని, ఇటీవల అంతారం గ్రామంలో తన పర్యటనలో స్థానికులు ఈ విషయం తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. అధికారులను అడిగితే నల్లా మరమ్మతులు చేయాల్సి ఉన్నదని చెప్పారని వివరించారు. ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా నిర్వహణ జరగడం లేదని స్థానికులు చెప్పారని తెలిపారు. సీఎం మెప్పు కోసమే కేసీఆర్ కుటుంబంపై, తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్సార్, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో పనిచేశానని, కేసీఆర్ కూడా తనకు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు.