రాష్ట్ర రాజధాని భాగ్యనగరం ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు నెలవు. సాలార్ జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, చార్మినార్, ఆర్ట్స్ కాలేజీ(ఓయూ)తో పాటు పలు కట్టడాల్లో అద్భుతమైన కళా నైపుణ్యాన్ని గమనించే ఉంటాం. అదే విధంగా కోఠి ఉమెన్స్ కాలేజీలోకి ప్రవేశించామంటే అద్భుతమైన మరో కట్టడం దర్శనమిస్తోంది. అదే బ్రిటీష్ రెసిడెన్సీ. అయితే ఈ భవనం చూడటానికి వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ మాదిరిగానే ఉంటుంది. వాస్తవానికి ఈ రెండు భవనాలకు ఒకదానికొకటి సంబంధం లేకపోయినప్పటికీ పల్లాడియన్ శైలి, సమకాలీన పరిస్థితులు మాత్రం పోలికలను తెచ్చిపెట్టాయి. వైట్ హౌస్‌ను పోలిన బ్రిటీష్ రెసిడెన్సీ భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకెందుకు ఆలస్యం చూసొద్దాం పదండీ..
బ్రిటీష్ రెసిడెన్సీని ఇటీవలే ఆధునీకరించారు. ఈ భవనాన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు, అధికారిక సమావేశాలకు, సినిమా షూటింగ్‌లతో పాటు ఫోటో షూట్‌కు అద్దెకు తీసుకుంటుంటారు. టాలీవుడ్‌కు సంబంధించిన ఎన్నో సినిమాలను ఈ భవనం వెలుపల, లోపల చిత్రీకరించారు. ఈ భవనాన్ని 1803లో జేమ్స్ అకిలెస్ డైరెక్షన్లో నిర్మించారు. మద్రాస్ ఇంజినీర్ లెఫ్టినెంట్ శ్యామూల్ రస్సెల్ డిజైన్ చేశారు. ఇండియన్ క్రాఫ్ట్ వర్కర్సే ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్నారు. బ్రిటీష్ రెసిడెన్సీ పునరుద్ధరణ పనులను రూ. 17 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ భవనాన్ని ఎలా రూపొందించారు అనే విషయాలను తెలుసుకునేందుకు ఆడియో విజువల్ గదిలో విజిటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్రిటీష్ రెసిడెన్సీని వీక్షించాలంటే విద్యార్థులకు రూ. 50, స్థానికులకు రూ. 100, విదేశీయులకు రూ. 200గా ప్రవేశ రుసుం నిర్ధారించారు.