హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): గ్రీన్ చాలెంజ్ ఒక్క ఇండియాకు మాత్రమే పరిమితం కాకూడదని, ఇది విశ్వవ్యాపితమైనదని, మానవ నాగరికత నడుస్తున్న ప్రతిచోట ఇది అవసరమేనని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ చెప్పారు. మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఆదివారం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా బంజారాహిల్స్ పంచవటి కాలనీలో ఆయన మొక్కలు నాటారు. నిత్యం మొక్కలు నాటించే గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఎంతో అద్భుతమైనదని, మనిషి తలుచుకుంటే ఎలాంటి కార్యాన్ని అయినా సాధించవచ్చని ఎంపీ సంతోష్‌కుమార్ నిరూపించారని ప్రశంసించారు. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న సంతోష్‌కుమార్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంపునకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని కొనియాడారు. పిలువగానే వచ్చి పాల్గొన్న ఆండ్రూ ఫ్లెమింగ్‌కు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు కొవిడ్ వారియర్స్ పాల్గొన్నారు.