Telangana | ఆకాశంలో సగం కాదు.. ‘ఆమె’నే ఆకాశం!
అవకాశాల్లో సగం కాదు.. ‘ఆమె’దే అగ్రభాగం!
దీనినే చేతల్లో చూపుతున్నది తెలంగాణ. కేసీఆర్ పాలనలో అతివలు పారిశ్రామిక వేత్తలుగా మారుతున్నారు. రాష్ట్రంలోని 40శాతం చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు యజమానులు మహిళలే. జాతీయ సగటు కన్నా రెట్టింపుతో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): సాధించాలనే లక్ష్యం, పట్టుదల ఉంటే చాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు తెలంగాణ ఆడబిడ్డలు. కేసీఆర్ సర్కారు ప్రోత్సాహం దీనికి తోడవడంతో దేశంలో మరే ఇతర రాష్ర్టానికి సాధ్యంకాని అద్భుతాలను సృష్టిస్తున్నారు. డేటా మ్యాప్స్ వేదిక ఇండియా ఇన్ పిక్సెల్స్ మ్యాప్స్ (ఐఐపీ-మ్యాప్స్) తాజాగా విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. తెలంగాణలోని మొత్తం సూక్ష్మ, మధ్యశ్రేణి పరిశ్రమల్లో (ఎంఎస్ఎంఈ)40 శాతం కంపెనీల్లో మహిళలే సారథులుగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. ప్రత్యేక గ్రాంట్లు లభిస్తున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ను మినహాయిస్తే, మహిళామణులు యజమానులుగా ఉన్న చిన్న, మధ్యస్థ పరిశ్రమలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణేనని పేర్కొంది. ఈ మేరకు ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ 2022-23 వార్షిక నివేదికను ఉటంకించింది.
తెలంగాణ రాష్ట్రంలోని 40 శాతం ఎంఎస్ఎంఈలు మహిళల నేతృత్వంలో కొనసాగుతుండగా, దేశంలో సగటున ఇది 20 శాతంగా మాత్రమే ఉన్నది. కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ (9 శాతం), రాజస్థాన్ (14 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (13 శాతం), కర్ణాటక (26 శాతం), బీజేపీపాలిత గుజరాత్ (26 శాతం), యూపీ (10 శాతం), మధ్యప్రదేశ్ (14 శాతం) రాష్ర్టాలు ఈ విషయంలో అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి.
ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తెలంగాణ సర్కా రు 2018 మార్చిలో విమెన్ ఆంత్రప్రెన్యూర్స్ హబ్ (వీహబ్)ను నెలకొల్పింది. స్టార్టప్‌లకు నిధులను సమకూర్చడంతో పాటు నిత్యావసర వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, చేనేత వస్ర్తాలు, దుస్తుల తయారీ, ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన అనేక స్టార్టప్‌లు వీహబ్‌లో ఇంక్యుబేట్ అవుతున్నాయి. మహిళా పారిశ్రామికవేత్తలకు దన్నుగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం మరో అడుగు ముందుకేసి సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పుర్‌లో కిందటేడాది ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశ్రామిక పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో స్థానికులకు పెద్దయెత్తున ఉపాధి కూడా లభించింది.
V Hub1
మహిళా సారథులు గల ఎంఎస్ఎంఈల్లో తెలంగాణే లీడర్.
– ఐటీ మంత్రి కేటీఆర్
తెలంగాణ ఆర్థికవ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని, సహకారాన్ని పెంచడంలో కృషిచేసిన కేసీఆర్‌కి, కేటీఆర్‌కి, వీహబ్-హైదరాబాద్‌కు ధన్యవాదాలు.
– కేసీఆర్ మనుమడు హిమాన్షు