హైదరాబాద్, జనవరి21 (నమస్తే తెలంగాణ): రివర్ బేసిన్‌లోని ప్రాంతాలకు సైతం గ తంలో పలు ట్రిబ్యునళ్లు నదీజలాలను కేటాయించాయని ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి ఢిల్లీలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ బుధవారం పునఃప్రారంభమైంది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది జయదీప్‌గుప్తా వాదనలు వినిపిస్తూ.. బేసిన్ వెలుపలి ప్రాంతాలకు నీటి మళ్లింపులను అనుమతించవద్దన్న తెలంగాణ విజ్ఞప్తితో విబేధించారు.
నది లేని రాష్ర్టాలకు సైతం నీటిని కేటాయించారని పేర్కొంటూ.. నర్మద, కావేరి ట్రిబ్యునళ్ల అవార్డులను ఉదహరించారు. కమాండ్ ఏరియాలో ఎకువ భాగం సాంకేతికంగా బయట బేసిన్లో ఉన్నప్పటికీ కృష్ణా ట్రిబ్యునల్-1 కృష్ణా డెల్టాకు నీటిని కేటాయించిందని గుర్తుచేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎకువ మిగులు జలాలు ఉన్నాయని, మరికొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఉన్నదని, దీన్ని పరిగణనలోకి తీసుకునే ఇంటర్ బేసిన్ బదిలీకి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రణాళికలను రూపొందిస్తున్నదని వివరించారు. ఇతర బేసిన్లతో పోలిస్తే పెన్నా బేసిన్లో నీటి లభ్యత 75% తకువగా ఉన్నదని చెప్పారు.
ఉమ్మడి ఏపీలో జరిగిన ఒప్పందాల నుంచి తెలంగాణ మినహాయింపు పొందలేదని, వరి సాగు విషయంలో ఏపీకి ఉన్న భౌగోళిక ప్రయోజనాన్ని విస్మరించలేమని తెలిపారు. కృష్ణా నదికి దక్షిణాన ఉన్న ఏపీకి గురుత్వాకర్షణ ప్రవాహం ద్వారా నీటిని సులభంగా మళ్లించవచ్చని, ఉత్తరం వైపున ఉన్న తెలంగాణకు లిఫ్ట్ పథకాలు అవసరమని చెప్పారు. బేసిన్ బయటి ఆ ప్రాంతాలకు నీటి మళ్లింపులను హెల్సింకీ, బెర్లిన్ నియమాలు నిరోధించబోవని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ పార్టీగా లేకపోయినప్పటికీ వాటి అవార్డులు తెలంగాణకు కట్టుబడి ఉన్నాయంటూ.. ఇప్పటికే ఉన్న నీటి వినియోగాలకు భంగం కలిగించకూడదని డిమాండ్ చేశారు.
పెన్నా బేసిన్లో నీటి వినియోగానికి సంబంధించి గోదావరి నుంచి ప్రత్యామ్నాయంగా నీటిని పొందడం ఒకటే మార్గమని, అందుకే పోలవరం-నల్లమల్లసాగర్ లింకు ప్రాజెక్టు చేపట్టామని వివరించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ఉనికిలో లేదని, గోదావరి నుంచి నీరు రావడం లేదని, డీపీఆర్ దాఖలుకు సీడబ్ల్యూసీ కూడా అనుమతించలేదని వివరించారు. ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను తిరిగి కేటాయించాలంటూ తెలంగాణ చేస్తున్న డిమాండ్ సమంజసమైనది కాదని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం పాత చట్టాన్ని సవరించినా, రద్దు చేయకపోయినా అది వారసత్వ రాష్ట్రానికీ వర్తిస్తుందని, ఆ చట్టానికి రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.