కరీంనగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్లోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల వల్ల రాష్ట్ర ప్రజల జీవన విధానం మెరుగు పడిందన్నారు.
సాగు నీటి ప్రాజెక్టులతో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
సమైక్య పాలన నుంచి వేరుపడిన కొన్నాళ్లకే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న నిరంతర ప్రగతి శీల కార్యక్రమాలతో తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్శిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసమే కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.
రైతుబంధు పథకంతో రైతును రాజును చేస్తానన్న సంకల్పం నెరవేరిందన్నారు. రైతుబీమాతో అకాల మరణాలు చెందిన రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత మెరుగైన విద్యుత్తును అందిస్తున్నారని, సబ్సీడీపై విత్తనాలు, ఎరువులు ఇస్తున్నారని చెప్పారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని, ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న జూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 9,548 మంది లబ్ధిదారులకు 8,459 యూనిట్లను గ్రౌండింగ్ చేశామన్నారు. ఇలా ఎన్నో పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచి రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారని సీఎం కేసీఆర్ను మంత్రి గంగుల కొనియాడారు.
ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల ఉమ, మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ తదితరులు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల అమరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.