Kamareddy | కామారెడ్డి, ఫిబ్రవరి 21: పెండ్లి పందిట్లో కూతురి పెండ్లి జరిపిస్తున్న ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోయిన విషాదకర ఘటన కామారెడ్డిలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. భిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన కుడిక్యాల బాల్చంద్రం కుటుంబం కామారెడ్డిలో స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జ్ఞాపకశక్తి పోటీల్లో ఇద్దరు కూతుళ్లు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాచారు. పెద్ద కూతురు కనక మహాలక్ష్మికి ఇటీవలే పెండ్లి ఖరారు చేశారు.
శుక్రవారం కామారెడ్డిలోని ఓ ఫంక్షన్హాల్లో పెండ్లికి ఏర్పాట్లు చేశారు. శాస్ర్తోక్తంగా పెండ్లి జరుగుతున్న తరుణంలో బాల్చంద్రం పందిట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందా డు. బంధువులు తండ్రి మరణవార్త చెప్పకుండానే వివాహ క్రతువును పూర్తి చేయించారు. ఆ తర్వాత బాల్చంద్రం కన్నుమూసిన వార్త తెలియడంతో ఒక్కసారిగా ఫంక్షన్ హాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.