కరీంనగర్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, నగునూర్ శివారులోని వాగు పరిసరాల్లో ఇటుక బట్టీల్లో పని చేసే 9 మంది అక్కడే చిక్కుకున్నారు.
విషయం తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మంత్రి ఆదేశాలతో అధికారులు రెస్క్యూ బృందాలను రప్పించి ఇటుక బట్టీ కార్మికులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మికులు ఇటుక బట్టీలపై ఎక్కి తలదాచుకుంటున్నారు. వీరిలో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మంత్రి గంగుల సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి వరదలో చిక్కుకున్న కార్మికుల పరిస్థితిని గమనిస్తున్నారు.