హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): నేషనల్ అక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్(న్యాక్) గుర్తింపు కోసం కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ‘న్యాక్’గా మంచి గ్రేడ్లు పొందేందుకు అక్రమాలకు పాల్పడుతున్నాయి. తనిఖీలకొచ్చే బృందాలకు పెద్ద ఎత్తున ముడుపులు, లంచాలు సమర్పించుకుంటున్నాయి. తనిఖీలకొస్తున్నారంటే చాలు వారికి స్టార్హోటళ్లలో విడిదితోపాటు కావాల్సిన ఏర్పాట్లు సమకూరుస్తున్నాయి. ఫలితంగా ప్రమాణాలు లేని కాలేజీలు కూడా ‘ఏ’ గ్రేడ్ దక్కించుకుంటున్నాయి. రెండేండ్ల క్రితం ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించి హైదరాబాద్లోని ఓ కాలేజీ అడ్డంగా బుక్కయ్యింది. అధికారుల పరిశీలనలో ఇవి ఫేక్ అని తేలడంతో సదరు కాలేజీని ఐదేండ్లపాటు బ్లాక్ లిస్టులో పెట్టారు. పనితీరులో అవకతవకలు, ఆరోపణల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 5వేల మంది అసెస్సర్లలో(తనిఖీ సభ్యులు) 900 మందిని న్యాక్ తొలగించింది.
న్యాక్ గుర్తింపును బట్టే యూజీసీ స్వయంప్రతిపత్తి (అటానమస్) హోదా కల్పిస్తున్నది. ఒక్కసారి అటానమస్ హోదా దక్కితే వీటిపై వర్సిటీల నియంత్రణ ఉండదు. సొంతంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఫలితాలు ప్రకటించుకోవచ్చు. రాష్ట్రంలో దాదాపు 300 విద్యాసంస్థలకు న్యాక్ గుర్తింపు ఉంది. వీటిలో అత్యధికం ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలే. 95 ఇంజినీరింగ్ కాలేజీలకు అటానమస్ హోదా ఉండగా.. 88 జేఎన్టీయూహెచ్ పరిధిలో, 7 ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. ఇక డిగ్రీలో తీసుకుంటే.. ఏడు యూనివర్సిటీ డిగ్రీ కాలేజీలు అటానమస్ హోదా దక్కించుకున్నాయి. 714 ప్రైవేట్ కాలేజీల్లో 7(1%)కాలేజీలకు మాత్రమే అటానమస్ హోదా ఉంటే.. 170 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 29 అటానమస్ కాలేజీలున్నాయి. కాగా, కొన్ని కాలేజీలు కమిటీల్లో తమకు అనుకూలురైన ప్రొఫెసర్లు వచ్చేలా.. సానుకూల నివేదిక ఇచ్చేలా ముందే ఒప్పందాలు చేసుకున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. తనిఖీ బృందాలకు కొన్ని కాలేజీలు రూ. 5లక్షలు ముట్టచెప్పుతుండగా, కొన్ని కాలేజీలు రూ. 20-50 లక్షల వరకు ముట్టచెబుతున్నట్టు ఆరోపణలున్నాయి.