హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లంచావతారులు రెచ్చిపోతున్నారు. గ్రామ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులను డబ్బుల కోసం పీక్కుతింటున్నారు. ఇంటి నిర్మాణ పనుల పురోగతిని ఫోటోలు తీసి, ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా లంచం ఇవ్వకుంటే రకరకాల కొర్రీలు వేసి, పనులు ముందుకు సాగకుండా చేస్తున్నారు. ఎందుకొచ్చిన ఇబ్బందులు అనుకొని కొందరు లంచాలు సమర్పించుకుంటున్నారు. మరికొందరు కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి గోడు వెళ్లబోసుకుంటున్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు.. మొదటి విడతలో 4.5లక్షల ఇండ్లు నిర్మించనున్నట్టు ప్రకటించింది. కాగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.12 లక్షల ఇండ్ల పనులు మాత్రమే ప్రారంభమైనట్టు అధికారులు చెప్తున్నారు. పథకం అమలు తీరు ఇంత నెమ్మదిగా ఉంటే, అవినీతి అధికారులు మరో తలనొప్పిగా తయారయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌కు వస్తున్న ఫోన్ కాల్స్‌లో లంచాలు డిమాండ్ చేస్తున్న అధికారులపై ఫిర్యాదు చేస్తున్నవే ఎక్కువగా ఉంటున్నాయి. దీన్నిబట్టి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎలా అమలవుతున్నదో అర్థం చేసుకోవచ్చని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇందిరమ్మ ఇంటికి అవినీతి బీటలు!
సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలోని ఏదులతండాకు చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు అంగోత్ తులసీబాయి హౌసింగ్ కార్పొరేషన్‌లోని కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తన ఇల్లు నిర్మాణం పునాదుల వరకు పూర్తయిందని, ఆ ఫొటో తీసి పంపడానికి పంచాయితీ కార్యదర్శి మహబూబ్ అలీ రూ. 10 వేలు లంచం అడుగుతున్నాడని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తాము రూ. 5వేలు రూపాయిలు ఇచ్చినట్టు తెలిపారు. అయినా ఇంటి పునాదుల ఫొటోను అప్లోడ్ చేయడంలేదని చెప్పారు. ఆమె తన ఫోన్ పే ద్వారా అతనికి డబ్బులు చెల్లించినట్టు అధికారుల విచారణలో తేలింది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం మాజీద్పూర్కు చెందిన కల్లె సత్యాలు అనే ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి తమ పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర పలు రకాలుగా సమస్యలు సృష్టించి వేధిస్తున్నాడని, రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. ఇంతవరకు ఇల్లు బేస్మెంట్ వరకు పూర్తయిందని, ఇప్పుడు కొర్రీలు పెడుతూ ఫోటో తీయకుండా వేధిస్తున్నాడని తెలిపారు.
ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్
ఇందిరమ్మ ఇంటి పథకంలో పేదలైన లబ్ధిదారుల నుంచి కొందరు లంచాలు డిమాండ్ చేయడం బాధాకరమని గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విచారణ వ్యక్తంచేశారు. బాధితులు ఇందిరమ్మ కాల్ సెంటర్ (టోల్‌ఫ్రీ నెంబర్- 18005995991)కు ఫిర్యాదు చేయాలని, 24గంటల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదును తక్షణం జిల్లా కలెక్టర్, ఎస్పీకి పంపడంతోపాటు సచివాలయంలోని తన కార్యాలయానికి కూడా పంపించాలని అధికారులకు సూచించినట్టు మంత్రి వివరించారు.
ఇందిరమ్మ కమిటీ సభ్యుడి చేతివాటం
నాగర్‌కర్నూలు జిల్లా తాండూరు మండలం సిర్సవాడ గ్రామానికి చెందిన ఏదుల భీమమ్మ అనే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు చేపట్టిన ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతూ, ఆమెను బెదిరించి డబ్బు వసూలు చేసినట్టు అందిన ఫిర్యాదుపై స్థానిక పోలీసుల కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదులోని వివరాల ప్రకారం భీమమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఆమె బావ ఏదుల నారాయణ తన భార్య పిల్లలతో కలిసి ఇంటి నిర్మాణానికి అడ్డుపడ్డారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చిక్కోండ్ర మల్లేశ్.. నారాయణకు అండగా నిలిచి సమస్య పరిష్కారం కావాలంటే రూ. 25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిన భీమమ్మ రూ.10 వేలు మల్లేశ్‌కు ఇచ్చింది. అయినప్పటికీ మల్లేశ్ ఏదుల నారాయణకు మద్దతుగా నిలిచి ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాడు. దీంతో భీమమ్మ తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు మల్లేశ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.