హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మద్యం సేవించారో లేదో తెలుసుకునేందుకు నిర్వహించే బ్రీత్ అనలైజర్ (Breath Analyzer) పరీక్ష ప్రాథమిక ఆధారం మాత్రమేనని హైకోర్టు స్పష్టం చేసింది. బ్రీత్ అనలైజర్ టెస్టు తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించకుండానే మద్యం సేవించి ఉన్నాడన్న కారణంతో ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగించడం చెల్లదని తేల్చిచెప్పింది.
వెంకటి అనే డ్రైవర్ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిరుడు ఏప్రిల్ 25న మధిర ఆర్టీసీ డిపో మేనేజర్ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఆ డ్రైవర్ను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పు వెలువరించారు.