హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయటం అంటే తెలంగాణ తల్లి రూపం మార్చినంత సులువు కాదని మరోసారి తేలిపోయింది. ఆయన ఆలోచనలు, ఆకాంక్షలను తెలంగాణ సమాజం నుంచి దూరం చేయటం ఎవరి తరమూ కాదని అసెంబ్లీ సాక్షిగా రుజువైంది. కేసీఆర్ అమలు చేసి చూపెట్టిన పథకాలను అనివార్యంగా సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగించాల్సిన గత్యంతరం ఏర్పడింది. సరిగ్గా రెండేండ్ల క్రితం 2024, ఫిబ్రవరి 19న ఇదే నిండు అసెంబ్లీలో ‘కేసీఆర్ ఆనవాళ్లను సమూలంగా మార్చేస్తాను. ఏ ఒక్క ఆనవాలు లేకుండా చేసే జిమ్మేదారి నాది’ అని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు అదే అసెంబ్లీ వేదికగా రెండు కొత్త పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ రెండు పథకాల్లో ఒకటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేసి చూపించిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం. మరోటి మూడోసారి అధికారంలోకి వస్తే అమలు చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ బీమా పథకం.
కేసీఆర్ హామీ ఇచ్చిన కుటుంబ బీమా
కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు ఆకస్మికంగా మరణిస్తే.. కారణంతో సంబంధం లేకుండా రూ.5 లక్షల తక్షణ బీమా చెల్లించాలని, రైతుబంధు తరహాలోనే కేసీఆర్ బీమా పథకం అమలు చేస్తామని, తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హుడు అని 2023 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించారు. రైతుబీమా తరహాలోనే ఈ పథకానికి కూడా వంద శాతం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని, తద్వారా పేదలకు ఎనలేని సేవ చేయటంతోపాటు ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీ బలోపేతానికి దోహదపడుతుందని బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో-2023లో ప్రకటించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సరిగ్గా ఇదే పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఇప్పుడు ప్రకటించింది. తాజా బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జూన్ 2 నుంచి పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల మంది లబ్ధి పొందుతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రకటించారు.
బీమా పథకాలన్నీ రద్దు
వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం 42 లక్షల మంది రైతులకు ‘రైతు బీమా’ అమలుచేసింది. 27 లక్షల మంది మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందేవిధంగా మత్స్యకార బీమా పథకం అమలుచేసింది. 16 లక్షల మందికి కార్మిక బీమా, 2.5 లక్షల మంది గీత కార్మికులకు, 6 లక్షల మంది ఆటోడ్రైవర్లు, 70 వేల మంది చేనేత కార్మికులు, 40 వేల మంది జర్నలిస్టులకు ప్రమాద బీమా పథకాన్ని అమలు చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వీటన్నిటినీ రద్దు చేసి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
రాష్ట్రమంతటా అమలైన ‘బ్రేక్‌ఫాస్ట్’
రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదించిన విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందే. బడ్జెట్లో 2026 -27 విద్యాసంవత్సరం నుంచి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ప్రారంభిస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ పథకాన్ని అమలుచేస్తామని పేర్కొన్నది. అంతేగాకుండా వారానికి 3 రోజులు పాలు (మిల్క్), మిగతా మూడు రోజులు రాగిజావ అందిస్తామని తెలిపింది. ఇదే స్కీమ్‌ను గత కేసీఆర్ సర్కార్ 2023లోనే ప్రారంభించి, అమలుచేసింది. ఈ పథకం యావత్తు నాడు దేశానికే ఆదర్శంగా మారింది. ఈ నేపథ్యంలోనే పీఎం పోషణ్ అభియాన్‌లో భాగంగా బ్రేక్‌ఫాస్ట్‌ను అమలుచేయాలని కేంద్రం యోచించింది.
బంద్పెట్టిన కాంగ్రెస్ సర్కార్
సర్కార్ బడుల్లో విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2023 అక్టోబర్ 6న ఈ పథకాన్ని అప్పటి మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాల పాఠశాలలో ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని 27,147 స్కూళ్లలో 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా ఈ పథకానికి నాటి సర్కార్ రూపకల్పన చేసింది. ఇందుకోసం రూ.672 కోట్లను కేటాయించింది. తొలుత నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 స్కూళ్లల్లో ఈ పథకాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత మండలానికి ఒక స్కూల్ చొప్పున విస్తరించారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారగా.. కాంగ్రెస్ సర్కార్ ఈ పథకాన్ని బంద్‌చేసింది. బడ్జెట్ కేటాయించకపోవడం, నిధులు మంజూరు చేయకపోవడంతో ఈ పథకం ఆగిపోయింది.
నాడు రాగి జావ పంపిణీ
రక్తహీనత, పోషకాహార లోపం తలెత్తకుండా ఉండేందుకు సర్కార్ బడుల్లోని విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం నాడు రాగిజావను కూడా అందజేసింది. విద్యార్థులకు వారానికి మూడు రోజులు ఫోర్టిఫైడ్ రాగి జావను పంపిణీ చేశారు. ఒక్కో విద్యార్థికి 10 గ్రాముల రాగి పౌడర్, 10 గ్రాముల బెల్లం చొప్పున ముడిసరుకు రూపంలో బడులకు సర్కార్ అందించగా, మధ్యాహ్న భోజన హెల్పర్ల ద్వారా జావను తయారుచేసి విద్యార్థులకు అందించేవారు. రేవంత్ సర్కార్ దీనిని కూడా బంద్పెట్టింది. మళ్లీ ఇప్పుడు రాగిజావ పంపిణీ చేస్తామంటూ బడ్జెట్లో ప్రకటించింది.
ఇంటర్లో మధ్యాహ్న భోజనం
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్న ప్రతిపాదన కూడా గత కేసీఆర్ సర్కార్ హయాంలోనిదే. అప్పట్లోనే మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై సర్కార్‌కు పలు సిఫారసులు చేసింది. 2018లోనే ఈ దిశలో చర్యలు చేపట్టింది. ఇంటర్, పాలిటెక్నిక్, వృత్తివిద్యా, డిగ్రీ కాలేజీల్లో ఈ పథకం అమలుకు చొరవ తీసుకున్నది. అక్షయపాత్ర సంస్థ ద్వారా పౌష్టికాహారం అందించాలని మంత్రివర్గం సిఫారసు చేసింది. కానీ ఇప్పుడు సర్కార్ ఇంటర్ విద్యార్థుల వరకే మధ్యాహ్న భోజనాన్ని పరిమితం చేసింది.