Raaka | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘రాకా’ సినిమాకు సంబంధించి ఓ సరికొత్త వార్త ఫిలింనగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. అనౌన్స్మెంట్తోనే భారీ అంచనాలను రేకెత్తించిన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. మీడియా కథనాల ప్రకారం, ‘రాకా’ చిత్రాన్ని మేకర్స్ సింగిల్ పార్ట్‌గా కాకుండా రెండు భారీ భాగాలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ రెండు భాగాలను కలిపి ఏకంగా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఈ రెండు భాగాలలోనూ ఇద్దరు స్టార్ హీరోయిన్లు అలరించనున్నారు. ఒక భాగంలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణ్ నటిస్తుండగా, మరో భాగంలో టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక కథాంశం విషయానికొస్తే, అట్లీ ఈ చిత్రాన్ని అత్యంత వైవిధ్యంగా ప్లాన్ చేశారు. ఒక పార్ట్‌ను పూర్తిగా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ మరియు ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తుండగా, మరో పార్ట్‌ను పూర్తిగా భిన్నమైన ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలో నడిచేలా రూపొందిస్తున్నారట. ఇందులో హిస్టారికల్ నేపథ్యంలో వచ్చే భాగంలో దీపికా పదుకొణ్ నటిస్తుందని తెలుస్తోంది. వీటితో పాటు ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో, ఈ చిత్రంలోనూ ఆయన నటిస్తే సినిమా స్థాయి మరింత పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు.