Telangana | నల్లగొండ, జనవరి 7 : నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినులకు గొడ్డుకారం అన్నం బ్రేక్‌ఫాస్ట్‌గా అందించారు. వర్సిటీలోని కృష్ణవేణి బాలికల వసతి గృహంలో మంగళవారం విద్యార్థినులకు బ్రేక్ ఫాస్ట్‌గా అన్నంతోపాటు గొడ్డుకారం పెట్టారు. విద్యార్థులు ప్లేట్లతో క్యూలో ఉండగా అన్నం, కారం బేసిన్, ఉప్పు డబ్బా పక్కనే ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఎంజీయూలో కారం అన్నమే బ్రేస్ట్‌ఫాస్ట్ అంటూ చక్కర్లు కొట్టాయి. కాగా, సాయంత్రానికి అదే విద్యార్థినులతో బ్రేక్‌ఫాస్ట్‌లో బోండా పెట్టారని, తామే కారం అన్నం అడిగామని లెటర్ విడుదల చేయించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు మాలధారణలో ఉన్నారని, చలికాలం కావడంతో కూర ఉన్నప్పటికీ కారం అడగడం వల్లే ఇచ్చామని హాస్టల్ సిబ్బంది వివరణతో మరో లెటర్ బయటకు వచ్చింది. ఆ తర్వాత హాస్టల్ డైరెక్టర్లు దోమల రమేశ్, కళ్యాణి కలిసి వార్డెన్లు రాజేశ్వరి, జ్యోతితో ప్రత్యక్ష పరిశీలన చేయించామని చెప్తూ మరోసారి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బ్రేక్‌ఫాస్ట్‌లో గొడ్డుకారం పెట్టడంపై స్పష్టత రాలేదు.