హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో పరిశ్రమలకు లీజుపై కేటాయించిన భూముల విక్రయం ముందుకు సాగడం లేదు. వాటి సబ్లీజుదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించంతో భూముల విక్రయ ప్రక్రియ నిలిచిపోయింది. కాగా, ప్రభుత్వం మాత్రం ఎలాగైనా ఆ భూముల విక్రయం ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్పేట్ తదితర ప్రాంతాల్లో పరిశ్రమలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు లీజు పద్ధతిలో నామమాత్ర ధరలకే భూములను కేటాయించాయి.
హైదరాబాద్కు నడిబొడ్డున ఉన్న ఆజామాబాద్ కాలక్రమంలో నివాస కాలనీగా మారిపోయింది. అక్కడ పరిశ్రమలకు కేటాయించిన ప్లాట్లలో అపార్ట్మెంట్లు, వ్యక్తిగత భవనాలు ఏర్పడ్డాయి. వాటిలో నివసిస్తున్నవారి అభ్యంతరాల వల్ల పారిశ్రాక ఉత్పత్తులు చాలావరకు తగ్గిపోయాయి. ఆ మూడు పారిశ్రామికవాడల్లో ప్లాట్లను విక్రయించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. 2023 ఆగస్టులో ఉత్తర్వులు జారీచేసింది.
సబ్లీజుదారులు ఒరిజనల్ అలాటీస్ రిజిస్ట్రేషన్ విలువకు రెట్టింపు ధర చెల్లించి ఆ భూములను సొంతం చేసుకోవచ్చు. అలా 169 ప్లాట్లకుగాను 32 ప్లాట్ల అమ్మకాలు జరుగగా.. మిగిలిన ప్లాట్లలో సింహభాగం సబ్లీజుదారులు కోర్టులను ఆశ్రయించారు. ఎంతో కాలంగా సబ్లీజుపై కొనసాగుతున్నందున తమకు కూడా రిజిస్ట్రేషన్ ధర ప్రకారమే విక్రయించాలని వారు కోరుతున్నారు. దీంతో ఆ భూముల విక్రయం నిలిచిపోయింది.
కేటాయింపుల వివరాలు

P