హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ నిలిచినట్టే.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఏర్పాటు కూడా ఇప్పట్లో లేనట్టే.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో వాటికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది. దేశవ్యాప్తంగా జనాభా లెకలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో జూన్ 30 తర్వాత చేసే ఏ భౌగోళిక పునర్వ్యవస్థీకరణను రాబోయే జనాభా లెకల కోసం పరిగణించబోమని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతో ఈ నెల 30 తర్వాత కొత్త స్థానిక సంస్థల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయనున్నది. ఫలితంగా కొత్త పంచాయతీలు, మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఏర్పాటుకు మూడేండ్లపాటు బ్రేక్ పడనున్నది. వచ్చే 15 రోజుల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కొత్త గ్రామాలు, మున్సిపాలిటీల ఏర్పాటుకు ఆమోదం తెలపడం కష్టసాధ్యమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. కొత్త మండలాలను, కొత్త మున్సిపాలిటీలను, కొత్త కార్పొరేషన్లను కూడా సృష్టించింది. కొన్ని గ్రామాలను మున్సిపాలిటీల్లో, కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లలో విలీనం చేసింది.
కొత్త గ్రామాలతో అదనపు ఆర్థికభారం
2026 జాతీయ జనాభా లెకలను కులగణనతో సహా 2025 జూన్ 30 నాటి పరిపాలనా పటం ఆధారంగా నిర్వహిస్తారు. ఈనెల 30 ఎన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటాయో వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. పంచాయతీరాజ్ శాఖ వద్ద ఇప్పటికే 250కిపైగా కొత్త గ్రామ పంచాయతీల ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇచ్చిన హామీలు పెద్ద సంఖ్యలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్థిక పరిమితులు, ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా లేని కారణంగా అనేక ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి. ‘కొత్త స్థానిక సంస్థల ఏర్పాటు అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం. గడువు నిర్ణయించినందున, వచ్చే మూడేండ్లపాట్లు కొత్త స్థానిక సంస్థలు లేదా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన ఏ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేము’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
కొత్త మున్సిపాలిటీల ఏర్పాటూ కష్టమే
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వెలుపల ఉన్న 30 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల పునర్వ్యవస్థీకరణతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఓఆర్ఆర్ లోపల ఉన్న 13 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేసేందుకు ప్రత్యేక కసరత్తు జరుగుతున్నది. వార్డు డీలిమిటేషన్ ప్రక్రియ ఈ నెల 21 నాటికి పూర్తి కానున్నది. ఇది పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం చేస్తుంది. ఇటీవల మూడు కొత్త కార్పొరేషన్లు, 18 కొత్త మున్సిపాలిటీలు ప్రతిపాదించబడ్డాయి. 10కి పైగా మున్సిపాలిటీల ఏర్పాటు ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి. అయితే, కేంద్రం విధించిన ఆంక్షల కారణంగా, జనాభా లెకల గడువుకు ముందు కొత్త మున్సిపాలిటీలు నోటిఫై చేసే అవకాశం దాదాపుగా లేదు. ప్రస్తుతం తెలంగాణలో 16 కార్పొరేషన్లతో సహా 151 మున్సిపాలిటీలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక లోటు ఈ సంవత్సరం రూ.6,700 కోట్లకు చేరినట్టు తాజా ఆర్థిక నివేదికలు తెలిపాయి. ఇది కొత్త సంస్థల ఏర్పాటును కష్టతరం చేస్తున్నది.