హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. జీహెచ్ఎంసీ మినహా 31 జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) వర్తించనున్నది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కొత్త ప్రాజెక్టులు, కొత్త మంజూరులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించకూడదు. ఈ ఎన్నికలు ముగిసే వరకు కొత్త అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కూడా ఆంక్షలు ఉంటాయి. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక జిల్లాల్లో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని రోడ్లు కొన్నిచోట్ల కొట్టుకుపోగా, మరికొన్ని ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. వాటికి తక్షణం మరమ్మతులు చేయాలని, ఇందుకు నిధులు కావాలని ఆయా శాఖలు ప్రభుత్వానికి ప్రాతిపాదనలు అందించాయి. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో పనులు చేపట్టలేదు. ఇప్పుడు రోడ్ల మరమ్మతులపై కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీస్తే, ఎన్నికల కోడ్ ఉన్నదని కాబట్టి చేయలేకపోతున్నామని చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు దాదాపు రెండు నెలలపాటు గుంతలు పడ్డ రోడ్లపై నరకం చూడాల్సిందేనా? అని వాహనదారులు వ్యాఖ్యానిస్తున్నారు.
గ్రూప్-2 నియామక పత్రాల జారీకి బ్రేక్
గ్రూప్-2లోని 782 పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. రెండు మూడురోజుల్లో నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వ వర్గాలు భావించాయి. అయితే, సోమవారం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నియామకపత్రాల జారీకి బ్రేక్ పడింది. ఎన్నికల తర్వాత గ్రూప్-2 ఉద్యోగాలు సాధించినవారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉన్నది.
చేప పిల్లల పంపిణీపై ఈఎన్సీకి లేఖ
ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో చెరువులు, కుంటలు నిండేనాటికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసేది. సహకార సంఘాలకు, మత్స్యకారులకు వీటిని అందించేవారు. మే, జూన్ నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి జూలై చివర నాటికి, లేదా ఆగస్టులో చెరువుల్లో చేపపిల్లలు వదిలేవారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే చేపపిల్లల పంపిణీకి సంబంధించిన రూ.123 కోట్ల టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. అక్టోబర్‌లో చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉన్నది. ఎన్నికల కోడ్ కారణంగా చేపపిల్లల పంపిణీకి బ్రేక్ పడింది. అయితే, టెండర్లు పూర్తయినందున చేపపిల్లల పంపిణీకి అనుమతి ఇవ్వాలని, కోడ్ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని మత్య్సశాఖ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు.