హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): 11వేల టీచర్ పోస్టులను భర్తీచేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసినా ప్రస్తుతం 10వేల మంది టీచర్లకు ప్రభుత్వం కొలువులివ్వనున్నది. మిగతా పోస్టుల భర్తీకి వివాదాలు, కోర్టుకేసులు అడ్డంకిగా నిలిచాయి. పలు కారణాలతో 13 జిల్లాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టుల భర్తీకి బ్రేక్‌లు పడ్డాయి. 10 వేల మంది కొత్త టీచర్లకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు ఇవ్వనున్నారు. సోమవారం అర్ధరాత్రి 1:1 జాబితాను జిల్లాలకు పంపించారు. బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇంకా డీఎస్సీకి పలు వివాదాలు వెంటాడుతున్నాయి.
ప్రత్యేక టెట్‌పై కోర్టుకు..
డీఎస్సీ నియామకాలకు ముందు మరో వాదన బయటికొచ్చింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించకుండా, రెగ్యులర్ టెట్‌ను నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 21 రకాల వైకల్యాలున్న వారికి బోధిస్తారు. సబ్జెక్టులు సైతం వేరుగా ఉంటాయి. కానీ వీరికి రెగ్యులర్ టెట్‌ను రాసుకునే అవకాశమిచ్చారు. అప్పట్లో దీనిపై అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తారు. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 13 జిల్లాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. మిగతా జిల్లాలతోపాటే తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని మరికొందరు అభ్యర్థులు సైఫాబాద్‌లోని డైరెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అభ్యర్థులు అధికారులను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.