గద్వాల, జూన్ 13 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పర్యటన రసాభసాగా మా రింది. సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్ల చేతిలో నష్టపోతున్నారని సీడ్ పత్తి రైతులతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నేత కురువ విజయ్‌కుమార్ ఇటీవల హైదరాబాద్‌లో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తోపాటు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి వినతిపత్రం అందించారు. స్పందించిన చైర్మన్ జిల్లాలో పర్యటనకు వచ్చారు. పుటాన్‌పల్లిలో కోటేశ్వర్‌రెడ్డి అనే రైతుతో కలెక్టర్ సంతోష్ మాట్లాడిన అనంతరం చైర్మన్.. పత్తి పంటను పరిశీలించగా కాంగ్రెస్ నాయకులు, అధికార పార్టీకి చెందిన సీడ్ ఆర్గనైజర్లు, రైతులతో మాట్లాడనివ్వకుండా వారే సమస్యలను వివరించారు.
సమస్య ఉన్న చోటుకు వెళ్దామని చైర్మన్‌ను బీఆర్ఎస్ నేత విజ య్ కోరారు. దీంతో కాంగ్రెస్ నేతలు, విజయ్ మధ్య మాటలయుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో రెండువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకున్నది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. దీంతో చైర్మన్ పంట పొలాలను పరిశీలించకుండానే వెళ్లిపోయారు. కలెక్టరేట్‌కు చైర్మన్‌తో కలిసి విజయ్ వెళ్లే సమయంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రేవులపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గొడవకు కారణమైన కాంగ్రెస్ నాయకులను మాత్రం వదిలిపెట్టారు. మల్దకల్ రైతును పోలీసులు మెడబట్టి వారి వాహనంలో తరలించారు.