Telangana | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఖజానాకు కష్టకాలం మొదలైంది. అన్ని రంగాల్లో స్తబ్ధత నెలకొనడంతో అభివృద్ధికి బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఆర్థిక రంగ వృద్ధి ‘కరోనా’ కాలాన్ని తలపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కాగ్‌కు సమర్పించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రెవెన్యూ రిసిప్ట్‌లను పరిశీలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ఖజానాకు వివిధ మార్గాల ద్వారా రూ.1,03,300.04 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే రూ. 7,841.23 కోట్ల తగ్గుదల నమోదైంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇలా ఆదాయం తగ్గడం ఇది రెండోసారి మాత్రమే. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా 7% ఆదాయం తగ్గగా.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మరోసారి 7% తగ్గుదల నమోదైంది.
ఏటేటా పెరిగిన ఆదాయం
రాష్ట్ర ఖజానాకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతున్నది. జీఎస్టీ, సేల్స్‌ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ రెవెన్యూ, కేంద్ర పన్నుల్లో వాటా వంటివి పన్ను ఆదాయం కాగా, పన్నేతర ఆదాయం, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ల రూపంలో ఖజానాకు నిధులు చేరుతాయి. వీటన్నింటినీ రెవెన్యూ రిసిప్ట్లుగా పిలుస్తుంటారు. వీటిని రాష్ర్టానికి వచ్చ ఆదాయంగా పరిగణిస్తారు. రుణాలు సేకరించడం ద్వారా సమకూరే నిధులను క్యాపిటల్ రిసిప్ట్గా పేర్కొంటారు. ఆదాయం పెరగడాన్ని (రెవెన్యూ రిసిప్ట్) రాష్ట్ర అభివృద్ధికి సూచికగా భావిస్తుంటారు. 2015 నుంచి 2023 వరకు పరిశీలిస్తే.. కేసీఆర్ పాలనలో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఆదాయం ఏటా పెరిగింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, అముల చేసిన సంక్షేమ పథకాలు వంటివి ఆదాయాన్ని పెంచడానికి దోహదం చేశాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఐటీ, రియల్ఎస్టేట్, పరిశ్రమలు, నిర్మాణ రంగం.. ఇలా అన్ని రంగాల్లోనూ వృద్ధి సాధించడంతో ఆదాయం ఏటేటా గణనీయంగా పెరిగింది. తొమ్మిదేండ్లలో సగటున 12.54% ఆదాయ వృద్ధిరేటు నమోదైంది. 2015లో నవంబర్ నాటికి ఆదాయం రూ.41,049.26 కోట్లు ఉండగా, 2023 నాటికి రూ.1,11,141.37 కోట్లకు చేరింది. అంటే.. రెండున్నర రెట్లు పెరిగింది.
కరోనాతో బ్రేకులు.. వెంటనే జెట్ స్పీడ్
కేసీఆర్ పాలనలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఆదాయ వృద్ధి మైనస్‌లో నమోదైంది. ఆ ఏడాది కరోనా దెబ్బకొట్టడంతో అంతకుముందు ఏడాదితో పోల్చితే దాదాపు 8% ఆదాయం పడిపోయింది. కానీ.. మరుసటి సంవత్సరంలో గోడకు కొట్టిన బంతిలా రెట్టింపు వేగంతో అనూహ్య వృద్ధి సాధించింది. 2021-22లో ఏకంగా ఆదాయ వృద్ధి 31.59% నమోదైంది.
అసంబద్ధ విధానాల ఫలితం
కొవిడ్ కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు రెండోసారి ఆదాయ వృద్ధికి బ్రేకులు పడ్డాయి. 2023తో పోల్చితే ఈసారి 7% పడిపోయింది. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వ అసంబద్ధ విధానాలే కారణమని నిపుణులు చెప్తున్నారు. సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేయడం, రైతుబంధు ఎగ్గొట్టడంతో వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని, విచ్చలవిడి వసూళ్లు, హైడ్రాతో రియల్ఎస్టేట్ రంగం కుప్పకూలిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వచ్ఛ్ బయోగ్రీన్ వంటి ఘటనలతో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి పరిశ్రమల రాక ఆగిపోయిందని అంటున్నారు. కంపెనీలు వెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితి ఉన్నదని చెప్తున్నారు. దీంతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరమే ఇలా ఉంటే రానురాను రాష్ట్ర పరిస్థితి ఎలా మారుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.