Kurumurthy Jatara | పేదల తిరుపతిగా విలసిల్లుతున్న కురుమార్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. యాగశాల మండపాలంకరణంతో వేడుకలు మొదలయ్యాయి. దాదాపు నెల రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. శుక్రవారం ఆలయంలో ఆవాహిత దేవతా పూజలు జరుగనున్నాయి. ఉత్సవాల్లో ప్రధానఘట్టమైన స్వామివారి కల్యాణోత్సవం నవంబర్ 2న, అలంకారోత్సవం 6న, ఉద్దాలోత్సవం 8న జరుగనున్నాయి. ఉత్సవాలకు లక్ష మంది వస్తారని.. ఉద్దాలోత్సవం రోజున నాలుగు లక్షల మంది తరలిరానున్నట్లు అంచనా వేశారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తిలో కొలువైన వేంకటేశ్వరస్వామి కురుమూర్తి రాయుడిగా పూజలందుకుంటున్నాడు. ఏడుకొండల మధ్య కాంచనగుహలో కొలువుదీరిన స్వామిని భక్తులు కొలుస్తుంటారు. ఏటా ఉత్సవాల బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతుంటాయి.
ఇక్కడి ప్రజలంతా స్వామివారిని ఇలవేల్పుగా భావిస్తుంటారు. దేశంలో ఎక్కడ ఉన్నా ఉద్దాలోత్సవానికి తప్పనిసరిగా కుటుంబ సమేతంగా సొంత ఊరుకు చేరుకుంటారు. ఉత్సవం రోజున స్వామివారిని కొలిచి, రాత్రి మొత్తం అక్కడే ఉండి స్వామి సన్నిధిలో జాగరణ చేస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల ఊరేగింపే ప్రధాన ఘట్టం కాగా.. పల్లమర్రి నుంచి చాటను ఊరేగింపుగా వడ్డేమాన్ వరకు తీసుకువస్తారు. అక్కడే నియమ నిష్టలతో తయారు చేసిన స్వామివారి పాదుకల (ఉద్దాల) ఊరేగింపు భారీ బందోబస్తు మధ్య ఆలయం వరకు కొనసాగడం ఆనవాయితీగా వస్తున్నది. బ్రహోత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు యావత్ తెలంగాణ నుంచి భక్తులు తరలివస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నది.
2న ధ్వజారోహణం, అష్టోత్తర శతకలశాభిషేకం, స్వామి కల్యాణం, మయూర వాహనసేవ జరుగుతాయి.
3న ప్రత్యేక పూజలు, హంసవాహన సేవ ఉంటుంది.
4న శేషవాహన సేవ నిర్వహిస్తారు.
5న ప్రత్యేక పూజలు, గజవాహన సేవ జరుగుతుంది.
6న స్వర్ణాభరణాలచే అలంకారం, అశ్వవాహన సేవపై స్వామివారి భక్తులను అనుగ్రహిస్తారు.
7న హనుమంత వాహనసేవ, గరుడ వాహనసేవ.
8న ఉద్దాలోత్సవం
9న ఆవాహిత దేవతా పూజలు, హోమాలు, పుష్పయాగం
10న అవభృత, మంగళ నీరాజనం కార్యక్రమాలు జరుగుతాయి.