ఖమ్మం, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో నిర్మిస్తున్న కట్టడాన్ని తక్షణమే తొలగించాలని బ్రాహ్మణ సంఘం నాయకులు ఖమ్మంలో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ వద్ద పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహం ఖమ్మం నగరానికి తలమానికంగా ఉంది.
పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. పీవీ విగ్రహ ప్రాంగణంలో కొత్త కట్టడ నిర్మాణం జరుగుతుండడంతో బ్రాహ్మణ సంఘం నాయకులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొలిసారి మంత్రి పదవి చేపట్టి 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన అభిమాన సంఘం బాధ్యులు ఇదే పీవీ విగ్రహ ప్రాంగణంలో పైలాన్ నిర్మాణ పనులు వేగవంతం చేయడాన్ని బ్రాహ్మణ సంఘం నాయకులు ఆక్షేపించారు.
పీవీని అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో ఏ కట్టడం చేపట్టినా ఆయనను అవమానించినట్లే అవుతుందని చెప్పారు. పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నాలుగేండ్ల క్రితం ఈ కాంస్య విగ్రహాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిందని గుర్తుచేశారు. పీవీ కూతురు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలిసి దీనిని ఆవిష్కరించారని గుర్తుచేశారు. అప్పటి నుంచి పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఈ ప్రాంగణంలోనే నిర్వహిస్తున్నామన్నారు.
ఖమ్మంలోని పీవీ విగ్రహ ప్రాంగణంలో ఎ త్తయిన కట్టడాన్ని నిర్మిస్తున్నారన్న సమాచారం తెలియడంతో ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె సురభి వాణీదేవి వెంటనే స్పందించారు. విషయాన్ని ఖమ్మం కలెక్టర్ దివాకర దృష్టికి తీసుకెళ్లారు. దేశ నేతల విగ్రహాల ప్రాంగణంలో మరే ఇతర కట్టడాలను నిర్మించడం సంప్రదాయం కాదని, ఎక్కడా ఇలా జరుగలేదని చెప్పారు. తక్షణమే దీనిని తొలగించాలని కోరారు. పీవీ అభిమానుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సదరు కట్టడాన్ని నిలిపివేయిస్తున్నట్టు ఖమ్మం కలెక్టర్ తనకు హామీ ఇచ్చారని వాణీదేవి మీడియాకు తెలిపారు. బ్రాహ్మణ సంఘం నాయకులు సురావర్జుల వాసు, మాటూరి లక్ష్మీనారాయణ, ఊటుకూరి రవికాంత్ నేతృత్వంలో పలువురు నాయకులు కేఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు.