హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు ప్రపంచానికే ఆదర్శనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే శ్లాఘించారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆదివారం హైకోర్టు బార్ అసోసియేషన్ హాలులో నిర్వహించిన కార్యక్రమానికి జస్టిస్ అరాధే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిజర్వు బ్యాంకు, ఫైనాన్స్ కమిషన్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న అంబేదర్ దూరదృష్టిని కొనియాడారు. అణగారిన వర్గాలకు రిజర్వేన్లు కల్పించడం ద్వారా సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు.
అంబేదర్ అనుసరించిన మార్గం ఎప్పటికీ అనుసరణీయమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్ కోషి అన్నారు. జస్టిస్ గిరిజా ప్రియదర్శిని, జస్టిస్ నగేశ్ భీమపాక ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ అధ్యక్షుడు అయ్యాడపు రవీందర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, ఏఎస్జీ నరసింహశర్మ, డీఎస్జీ గాడి ప్రవీణ్‌కుమార్, పీపీ నాగేశ్వర్రావు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సునీల్‌గౌడ్, మాజీ ఏజీ బీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.