హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తలపెట్టిన ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతున్నది. బంద్ విషయంలో తగ్గేదేలేదంటున్నాయి. సోమవారం నుంచి కాలేజీల బంద్ చేపట్టిన యాజమాన్యాలు, మంగళవారం పరీక్షలను బహిష్కరించాయి. జేఎన్టీయూ పరిధిలో బీ ఫార్మసీ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉండగా పరీక్షలకు యాజమాన్యాలు సహకరించలేదు. మొత్తం 61 కాలేజీల్లో పరీక్షలు జరగాల్సి ఉండగా.. కేవలం 9 సెంటర్లలో మాత్రమే పరీక్షలు జరిగాయి.
52 కాలేజీల్లో జరగలేదు. తొలిరోజు పరీక్షలకు 88శాతం మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు జేఎన్టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణమోహన్‌రావు తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షకు మొత్తం 6,205 మందికి కేవలం 742(11.96శాతం)మంది, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు మొత్తం 7,471 మందికి 842(11.27శాతం)మంది మాత్రమే హాజరయ్యారు. బుధవారం జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వర్రావు తెలిపారు. పరీక్షల విషయంలో ఇబ్బందులుంటే వర్సిటీ అధికారులను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు.
ఎల్బీ స్టేడియంలో సభ
సర్కారు మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 8న లక్ష మందితో ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్(ఫతి) ప్రకటించింది. కాలేజీల అధ్యాపకులు, సిబ్బందితో భారీ సభను నిర్వహిస్తామని తెలిపింది. 11న 10 లక్షల మంది విద్యార్థులతో చలో సెక్రటేరియర్ లాంగ్‌మార్చ్ నిర్వహిస్తామని ఫతి ప్రతినిధులు వెల్లడించారు. బంద్ నేపథ్యంలో మంగళవారం ఫతి ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. రూ.450కోట్ల బకాయిలు విడుదల చేస్తామని, బంద్ విరమించాలని కోరింది. రూ.900కోట్లు ఇచ్చినా బంద్ విరమించబోమని, రూ.5వేల కోట్లు విడుదల చే యాల్సిందేనని కాలేజీల యాజమాన్యా లు కరాఖండిగా చెప్పినట్టు సమాచారం.