హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందేనని, లేకుంటే రిజర్వేషన్ల పెంపు సాధ్యంకాదని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తేల్చిచెప్పారు. రాజ్యాంగంలోని 243డీ ఉప నిబంధనను సవరిస్తే కూడా రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందని చెప్పారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తలుచుకుంటే కూడా గంటలో బీసీ బిల్లు అమలవుతుందని, స్పష్టంచేశారు.
కానీ, రాహుల్ అడగరు, మోదీ ఆమోదించరని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో బుధవారం వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బీసీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఈలోపే ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఈలోపే సీఎం, మంత్రులు బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేయాలని క్యాబినెట్లో నిర్ణయించారు.
ఈ క్రమంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా? జరగవా? అని అందరూ చర్చించుకుంటున్నారు. ఆర్డినెన్స్ ఎపుడూ ఆమోదానికి నోచుకోలేదు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను మోసం చేయాలని చూస్తున్నాయి’ అని మండిపడ్డారు. ‘50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 9వ షెడ్యూల్లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు. మొదటి నుంచీ 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును చేర్చాలని మా వాదన. తాజాగా మా బీసీ నాయకులు కూడా అదే చెప్పారు’ అని పేర్కొన్నారు.
బీసీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలుచేయడం చేతగాని బీజేపీ నేతలు బీసీని సీఎంగా చేస్తరా? అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగంలోని 243 డీ సబ్‌క్లాజ్‌ను సవరించి బీసీల రిజర్వేషన్లు పెంచవచ్చునని తెలిపారు. జీవో, ఆర్డినెన్స్‌ల ద్వారా పెంపు సాధ్యం కాదని చెపపారు. రిజర్వేషన్ల పెంపు కోసం గతంలోనే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపారని, ప్రస్తుత సర్కార్ పంపిన బిల్లును పార్లమెంటులో ఆమోదించవచ్చునని సూచించారు.
ఢిల్లీలో ధర్నా డ్రామాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యమనేనని వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. ఇందుకు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో మాట్లాడి ప్రధాని మోదీపై ఒత్తిడి పెంచవచ్చని, ధర్నాల పేరిట డ్రామాలు సరికాదని హితవు పలికారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేకున్నా బీసీలకు నాడు కేసీఆర్ ఎన్నో అవకాశాలు కల్పించారని తెలిపారు. అడ్వకేట్ జనరల్ పదవిని బీసీలకు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని, చిత్తశుద్ధి ఉంటే చట్టాలతో పనిలేదని కేసీఆర్ నిరూపించారని చెప్పారు. కానీ, బీజేపీ, కాంగ్రెస్‌కు 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు.