Karimnagar | కరీంనగర్ : తమ ప్రేమకు అడొస్తుందనే కారణంగా ప్రియురాలి తల్లిపై ప్రియుడు అత్యంత దారుణంగా దాడి చేశాడు. ఆమెను గొంతు పిసికి చంపేందుకు యత్నించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం అనుబంధ గ్రామమైన సుద్దాలపల్లిలో వెలుగు చూసింది.
సుద్దాలపల్లి గ్రామానికి చెందిన దూట రాజ్‌కుమార్, జాడి సుష్మిత అనే యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇది గమనించి కూతురు సుష్మితను తల్లి మందలించింది. పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి పరిస్థితి వివరించి కూతురు మనసు మార్చింది తల్లి. ఈ క్రమంలో తమ ప్రేమకు అడ్డు వస్తుందనే కారణంతో ఎలాగైనా తనను చంపాలనే కసితో బహిరంగంగానే ప్రియురాలి తల్లిని తీవ్రంగా కొట్టి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు రాజ్‌కుమార్.
అప్రమత్తమైన స్థానికులు.. సుష్మిత ఇంటికి చేరుకుని రాజ్‌కుమార్‌ను అడ్డుకున్నారు. అప్పటికే సుష్మిత తల్లికి ఊపిరాడటం లేదు.. ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. మొత్తానికి బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రాజ్ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.