హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమంటూ పదవులను సైతం గడ్డిపరకల్లా వదిలేయడం నేర్పిన కేసీఆర్ బాటలో నడుస్తూ తమ పదవులకు రాజీనామా చేసిన కొండూరి రవీందర్ రావు, గొంగిడి మహేందర్రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఎన్ని ప్రలోభాలు, ఒత్తిళ్లు వచ్చినా కాంగ్రెస్లో చేరకుండా నమ్మి నడిచిన బీఆర్ఎస్కు, కేసీఆర్ బాటకే జైకొట్టారని శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
తమ పదవీకాలంలో సహకార బ్యాంకులను అద్భుతంగా నడిపిన వీరి పేరు రాష్ట్ర సహకార రంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, రూ.పదివేల కోట్ల రుణాలతో ఉన్న టెసాబ్ను రూ.42వేల కోట్ల సంస్థగా తీర్చిదిద్ది, వినియోగదారుల సంఖ్యతో పాటు, డిపాజిట్లను మూడు రెట్లు పెంచి నమ్మకమైన సంస్థలుగా తయారు చేశారని గుర్తుచేశారు. వీరి రాజీనామా, నాయకత్వ లేమి రాష్ట్ర కో ఆపరేటివ్ రంగానికి తీరని లోటు అవుతుందని, అత్యుత్తమంగా పనిచేస్తున్న ప్రజాప్రతినిధులను కుట్రపూరితంగా పకకు తప్పించి రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తున్నదని విమర్శించారు.