Borla Ram Reddy | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా బోర్ల రామిరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలో బోర్లు వేసీవేసీ విసిగి వేసారి చివరికి తన ఇంటిపేరునే బోర్ల రామిరెడ్డిగా మార్చుకున్న ఆ రైతు మంగళవారం తెలంగాణభవన్‌లో కనిపించాడు. పార్టీ ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశం ఉన్నదని తెలుసుకొని నల్లగొండ జిల్లా ముషంపల్లికి చెందిన బైరెడ్డి రాంరెడ్డి తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఆయనను బీఆర్ఎస్ నాయకులు గుర్తించి భవన్లోపల కూర్చోబెట్టారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అయ్యాక కేసీఆర్ నేరుగా రామిరెడ్డి వద్దకు వచ్చి ‘రామన్నా.. బాగున్నవా?’ అంటూ ఆత్మీయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత రామిరెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఎవుసం పరిస్థితి మళ్ల మొదటికొచ్చింది. ఏం మంచిగలేదు. మళ్లీ ఫైట్ చెయ్యాలె. ఊర్లల్ల రైతుల అరిగోస పడుతున్నరు. మల్లా మీరే తండ్లాడాలె.
మళ్ల ఉద్యమం చేయాల్సిన పరిస్థితిని ఈ కాంగ్రెసోళ్లు తీస్కచ్చిండ్రు. అప్పుడు సమైక్య పాలకులతో కొట్లాడినట్టు ఇప్పుడు కాంగ్రెసోళ్లతో కొట్లాడే పరిస్థితి తెచ్చిండ్రు.. మా సాగర్ (నాగార్జునసాగర్) పరిస్థితి అంతంతమాత్రమే అయింది. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకున్నడు. కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు)పై పెత్తనం చెలాయిస్తున్నడు. వాటాకు మించి నీళ్లు తీస్కపోతున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అడిగే దమ్ములేదు. పరిస్థితి ఇట్లనే ఉంటే రేపు హైదరాబాద్‌కు కూడా తాగునీళ్లు దొరకవు.
సాగర్ నీళ్లన్నింటినీ ఒడగొట్టిచ్చిండ్రు. ఖతం పట్టిచ్చిండ్రు. కాంగ్రెసోళ్లకు పాలనా దక్షత లేదు.. ప్రాజెక్టులు నింపి వాడే విధానం తెల్వది.. అసలు తెలంగాణ గవర్నమెంట్‌కు ఆజమాయిషీ అనేదే లేకుండా పోయింది. పరిస్థితి అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని లెక్క తయారైంది. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వెయ్యాలె. కృష్ణాలో మా వాటా మాకే ఉండాలని కొట్లాడాలె. సార్ (కేసీఆర్) ఉన్నప్పుడు మా వాటా మాకిస్తవా? చస్తవా? అని గేటుకు తాళంపెట్టి నా నీళ్లు నాకే.. నీ నీళ్లు నీకే అని కొట్లాట పెట్టుకొని నీళ్లిచ్చిండు. పదేండ్లు రైతులు ఏ కష్టం లేకుంట ఉన్నరు. ఇప్పుడు పరిస్థితి మొదటికచ్చింది’ అని ఆవేదన చెందాడు.