హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీ వేగవంతమైంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బూస్టర్ డోస్ పంపిణీ చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రస్తుతం రోజుకు లక్ష మందికిపైగా ప్రికాషన్ డోస్ వేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన 33వేల మందికి ప్రికాషన్ డోస్ పంపిణీ చేయగా, శుక్ర, శనివారాల్లో పంపిణీ సుమారు మూడు రెట్లు పెరిగింది. ఆదివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 21.12 లక్షల మందికి బూస్టర్ పంపిణీ పూర్తయింది. మొత్తం 2.17 కోట్ల మంది బూస్టర్‌కు అర్హులుగా ఉన్నారు.
తొలిగిపోని కొవిడ్ ప్రభావం
రాష్ట్రంలో కొవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్నాళ్లుగా రోజుకు 800కుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇందులో అత్యధిక శాతం ఒమిక్రాన్ వేరియంటే ఉండటంతో పెద్దగా ప్రమాదం ఏమీ లేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. హోం ఐసొలేషన్‌తో నయం అవుతున్నదని చెప్పారు. అయినా ముప్పు తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం ఎలాంటి లక్షణాలు లేనివే (అసిమ్టమాటిక్). అయితే.. సిమ్టమాటిక్ కేసుల్లో 31 శాతం మందికి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, 48 శాతం మందికి మోడరేట్ (మధ్యస్థ) లక్షణాలు కనిపిస్తున్నాయని, 21 శాతం మందికి మాత్రం తీవ్ర లక్షణాలు ఉన్నాయని ఇటీవలే కేంద్రం లోక్‌సభలో ప్రకటించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా టెస్టుల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం రోజుకు సగటున 40 వేల వరకు టెస్టులు చేస్తున్నారు.