Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరం మంచినీళ్ల కోసం అల్లాడుతున్నది. నగరంలో ఎక్కడ చూసినా నీటి కటకట కనిపిస్తున్నది. బిందెలతో పరుగులు… ట్యాంకర్ల వద్ద తోపులాటలు మళ్లీ షరామామూలయ్యాయి. బస్తీలు, శివారు ప్రాంతాల్లో ఈ క‘న్నీటి’ దుస్థితి అధికంగా ఉన్నది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వెస్ట్ కారిడార్, శివారు ప్రాంతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. దీంతో ప్రస్తుతం నగరంలో రోజుకు 6500పైగా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి.
కొత్త నీటి వనరులు లేకపోవడం, అదనపు నీటి జలాల తరలింపులు లేక జలమండలి అధికారులు రోజూ నగరానికి ఐదు నీటి వనరుల ద్వారా 559.81 ఎంజీడీలకు సరఫరా చేస్తున్నారు. కానీ విద్యుత్ సరఫరాలో అంతరాయం, భూగర్భజలాలు అడుగంటిపోవడం, నల్లాలకు మోటార్లు బిగించడం, లోప్రెషర్ సమస్య… అన్నింటి కంటే మించి తాగునీటికి గణనీయమైన డిమాండ్‌తో జలమండలి సరఫరా చేస్తున్న జలం ఏ మూలకూ సరిపోవడం లేదు.
ప్రజలు పొదుపుగా నీటిని వాడుతున్నా అవసరాలు తీరడం లేదు. ఇటువంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా ఊహించలేదని మహిళలు చెబుతున్నారు. నీటి సరఫరా సమయం తగ్గించడమే కాకుండా లో ప్రెషర్‌తో నీటిని విడుదల చేయడం వల్ల ఈ సమస్య వస్తున్నదని చెప్తున్నారు. వచ్చే కొంచెం నీటిని బిందెలు, డ్రమ్ములలో నిల్వ ఉంచుకుని దినచర్యకు వాడుతున్నారు. ఇవి సరిపోకపోవడంతో చాలామంది ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నగరంలో రోజుకు సరాసరిగా 6500లకు పైగా ట్యాంకర్లు బుకింగ్ అవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా శేరిలింగంపల్లి అయ్యప్ప సొసైటీ, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో ట్యాంకర్లకు డిమాండ్ ఉంటున్నది. రోజుకు 4 ట్యాంకర్ల (500లీటర్లు) చొప్పున నెలకు 120 కొనాల్సి వస్తుందని, ఈ భారాన్ని మోయలేకపోతున్నామని యాజమానులు లబోదిబోమంటున్నారు. ట్యాంకర్లకు డిమాండ్ పెరుగడంతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నీటి కష్టాలు తప్పించాలని కోరుతున్నారు.