శంషాబాద్ రూరల్, నవంబర్ 1: జెడ్డా నుంచి హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో 6ఈ-68 నంబర్ విమానంలో బాంబు పెట్టినట్టు శనివారం ఉదయం ఈ మెయిల్ వచ్చిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమై ఇండిగో విమానాన్ని ముందుగా ముంబై ఎయిర్‌పోర్టుకు తరలించి.. సురక్షితంగా ల్యాండ్ చేసినట్టు వెల్లడించారు. అనంతరం విమానంలో విస్తృతంగా తనిఖీలు చేయగా, ఎలాంటి బాంబులేదని తేల్చినట్టు పేర్కొన్నారు. 1984లో మద్రాసు ఎయిర్‌పోర్టును పేల్చివేసిన తరహాలోనే ఎల్టీటీఈ-ఐఎస్ఐ ఆపరేటివ్‌లు దాడికి ప్లాన్ చేశారని ఈ మెయిల్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. బెదిరింపు మెయిల్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు అధికారులు వెల్లడించారు.