హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ ఎక్కువయ్యాయి. ఒక్క మే నెలలోనే మంగళవారం వరకు తెలంగాణ ఘటనలతో కలుపుకొని సుమారు వందలాది బాంబు బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వచ్చినట్టు ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. తాజ్ హోటల్, ముంబై విమానాశ్రయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, తెలంగాణ ప్రజాభవన్, నాంపల్లి కోర్టులు, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు, ఢిల్లీలోని దవాఖానలు, స్కూళ్లు, కాలేజీలకు ఈ బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి.
ప్రస్తుతానికి కాల్స్ వచ్చిన ప్రదేశాలన్నీ జనావాసం ఎక్కువగా ఉన్నవే కావడంతో మరింత ఆందోళన కలుగుతుంది. ఈ బాంబు బెదిరింపు కాల్స్ వెనుక ఉగ్రవాదుల కుట్ర ఏమైనా ఉందేమోనని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫేక్‌కాల్స్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగిందిని విశ్వసనీయ సమాచారం. కాగా, బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన వెంటనే అన్నిచోట్లా భద్రతా సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఫలానా చోట బాంబు ఉందని చెప్పిన ప్రాంతమంతా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన తర్వాతే.. ఫేక్ కాల్‌గా నిర్ధారిస్తున్నారు. ఒకే నెలలో కావాలనే ఎందుకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. బాంబుదాడులు జరగబోతున్నాయని ముందే ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారా? అనే అంశంపై కూడా దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. దీంతో అన్ని రాష్ర్టాల ఇంటెలిజెన్స్ పోలీసులకు నిఘా మరింత పెంచాలని కేంద్ర హోంశాఖ నుంచి అంతర్గత ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. దీంతో అన్ని రాష్ర్టాల ఇంటెలిజెన్స్ పోలీసుల అప్రమత్తమయ్యారు.
ప్రజాభవన్, నాంపల్లి కోర్టులకు..
మంగళవారం ఉదయం మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో బాంబు పెట్టామని, కాసేపట్లో అది పేలిపోతుందంటూ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఓ అగంతకుడి నుంచి కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్కాడ్‌తో ప్రజాభవన్ మొత్తం తనిఖీలు నిర్వహించారు. అణువణువునా గాలించిన తర్వాత ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క… డిప్యూటీ సీఎం అధికారిక నివాసమైన ప్రజాభవన్‌కు వచ్చి అధికారులతో మాట్లాడారు.
అనంతరం డిప్యూటీ సీఎం కుటుంబసభ్యుల క్షేమసమాచారం అడిగి తెలుసుకొన్నారు. ప్రజాభవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సందర్శకులు, ఫిర్యాదు దారులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆమె పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ప్రజాభవన్‌కు ఫేక్‌కాల్ వచ్చిన కొద్దిసేపటికే నాంపల్లి కోర్టుల భవన సముదాయానికి మరో బాంబు బెదిరింపుకాల్ వచ్చింది. దీంతో హుటాహుటిన డాగ్, బాంబు స్కాడ్ అక్కడికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ కూడా ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తమైంది. ఫేక్‌కాల్స్ వెనుక ఉన్న కుట్రను ఛేదించేపనిలో పడింది.