ఎల్కతుర్తి, ఏప్రిల్ 15 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయని వినోద్‌కుమార్ తెలిపారు. 500మంది ప్రతినిధులు కూర్చునేలా సభావేదికను ఏర్పాటు చేస్తున్నామని వొడితెల సతీశ్‌కుమార్ తెలిపారు.
గోదావరిఖని, ఏప్రిల్ 15: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఆటో యూనియన్ నాయకులు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రూ.50వేల విరాళాన్ని ప్రకటించారు. మంగళవారం గోదావరిఖనిలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను కలిసి నగదు అందజేశారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎం గా కేసీఆర్ ఆటోడ్రైవర్లను కడుపులో పెట్టుకుని కాపాడారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ఆటోవాలాల బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు.