హైదరాబాద్, జనవరి 19 (నమస్తేతెలంగాణ): ‘తెలంగాణ ఆవిర్భవించిన తొలిరోజుల్లోనే కేసీఆర్ కృష్ణా జలాల్లో వాటా కోసం పోరాడారు. సెక్షన్-3 ప్రకారం పంపిణీ చేయాలని కేంద్ర మంత్రులకు, ప్రధానికి లేఖలు రాశారు. పట్టించుకోకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు వేయించారు.’ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. అనేకసార్లు కేంద్రంపై ఒత్తిడి తేవడంతోనే వాటా తేల్చాలని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఆదేశించిందని గుర్తుచేశారు. కానీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు.
కృష్ణానీళ్లను కేసీఆర్ ఏపీకి తరలించారని అవగాహనారాహిత్యంతో ఆరోపణలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, గట్టు రాంచందర్‌రావు, గెల్లు శ్రీనివాస్, చిలకమర్రి నరసింహ, ఇంతియాజ్ అహ్మద్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వాటా తేల్చాలని అనేక సందర్భాల్లో ఒత్తిడి తెచ్చిన ఫలితంగా 2023 అక్టోబర్‌లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో విచారణకు మార్గం సుగమమైందని స్పష్టంచేశారు.
ఇవేవీ పట్టించుకోని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని మాట్లాడడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీ నాయకులు కూడా ఆయనకు వంతపాడడం వింతగా ఉన్నదని ఎద్దేవాచేశారు. నిజంగా ఆ రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్తో బహిరంగ చర్చకు సిద్ధంకావాలని సవాల్ విసిరారు. పదేండ్లలో కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంపుతామని, వాటిని చదువుకొనైనా అవగాహన పెంచుకోవాలని చురకలంటించారు.