సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 13: వేసవి సమీపిస్తున్నందున మేడిగడ్డ బరాజ్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగు నీరందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ బరాజ్‌లో ఒక బ్లాక్ కుంగిన విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. మరమ్మతులు చేయకుండా ఇప్పటికే 16 నెలల సమయాన్ని వృథా చేశాడని విమర్శించారు. డ్యాం సేఫ్టీ అథారిటీ పేరు చెప్పి సమయం వృథా చేశారని, రైతులకు సాగు నీరందించకపోతే సహించేదిలేదని హెచ్చరించారు.
గురువారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి నదీ జలాల వినియోగానికి ఎత్తిపోతల ద్వారా తప్పితే ప్రత్యామ్నాయ మార్గం లేదని అన్నారు. యాసంగి పంట వేసిన రైతులు సాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతల ద్వారా, గ్రావెటీ కెనాల్ ద్వారా తెచ్చిన నీటితో యావత్ ఉత్తర తెలంగాణ జిల్లాలకు కేసీఆర్ సాగు నీరందించిన విషయాన్ని గుర్తుచేశారు.
దిగువ నుంచి ఎగువకు ఎత్తిపోసిన నీటిని సిరిసిల్లలోని ఎస్సారార్ రిజర్వాయర్ (మిడ్ మానేరు) నుంచి ఎత్తిపోతల ద్వారా రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల నుంచి పూర్వపు మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు నీరు అందించినట్టు చెప్పారు. మేడిగడ్డ బరాజ్‌లో ఒక బ్లాక్ కుంగితే రాజకీయం చేసిన రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ నిర్మాణ పనులు ఎందుకు చేపట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
లక్షలాది మంది రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో పర్యటించిన సందర్భంలో రైతులు సాగు నీటి కోసం గగ్గోలు పెట్టారని,, ఎండిన పంటలు చూసి కంటతడిపెట్టుకున్నారని తెలిపారు. నీళ్లులేని పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో రైతులతో మాట్లాడిన సమయంలో వారు పంటపై పెట్టుబడి పెట్టేందుకు సందిగ్ధంలో ఉన్నారని పేర్కొన్నారు. ఎత్తిపోతల ద్వారా అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టులను నింపి మార్చి, ఏప్రిల్‌లోపు రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు.