హైదరాబాద్, మార్చి9 (నమస్తే తెలంగాణ)/నాగర్ కర్నూల్/అచ్చంపేట: ఎస్ఎల్బీసీ సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 16వ రోజైన ఆదివారం కొలిక్కి వచ్చింది. టన్నెల్లో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్(40)గా గుర్తించారు. ఇంకా ఏడుగురి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. క్యాడవర్ జాగిలాల ద్వారా గుర్తించిన మానవ అవయవాల అన్వేషణలో భాగంగా మట్టి తొలగింపుతో తొలుత చేయి, కాలు భాగాలను గుర్తించారు. 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీసి, టన్నెల్‌లోనే ప్యాకింగ్ చేసి, లోకోట్రైన్ ద్వారా వెలుపలికి తీసుకొచ్చారు. కుడి చేతికి ఉన్న కడియం ద్వారా అతడిని గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. సొరంగం వద్ద సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లో మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గురుప్రీత్‌సింగ్ మృతదేహం లభించిన దగ్గరలోనే మరో మూడు మృతదేహాలు ఉన్నట్టు గుర్తించిన రెస్క్యూ బృందాలు వాటిని కూడా వెలికి తీసేందుకు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. గుర్‌ప్రీత్‌సింగ్ స్వస్థలం పంజాబ్‌లోని తరణ్ జిల్లా చీమకలాన్. ఆయన రాబిన్స్ ఇండియా కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
మృతదేహానికి నాగర్‌కర్నూల్ ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి, ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించగా, వారు పంజాబ్‌కు బయలుదేరి వెళ్లారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనలో 16 రోజుల నిరీక్షణ తర్వాత ఒక కార్మికుడి మృతదేహం లభించడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. పంజాబ్‌కు చెందిన కార్మికుడు గురుప్రీత్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి వైఫల్యం, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని, మృతుడి కుటుంబానికి చెరో రూ.50 లక్షల చెప్పున రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మృతిచెందిన టీబీఎం ఆపరేటర్ గుర్‌ప్రీత్‌సింగ్ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గుర్‌ప్రీత్‌సింగ్ మృతికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతాపం తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల పరిహారాన్ని బాధిత కుటుంబానికి అందిస్తామని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ బదావత్ తెలిపారు.